CM Jagan- London Mystery: ఏపీ సీఎం జగన్ స్విట్జర్లాండ్‌లోని దావోస్ చేరుకున్నారు. కానీ.. ఆయన సాక్షి పత్రిక చెప్పినట్లుగా శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కాదు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కు ఆయన జూరెక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్లారు. మరి.. 24 గంటలు ఏమయ్యారంటే, లండన్‌లోనే ఉన్నారు! అధికారిక పర్యటన షెడ్యూలులో లేకుండా ఆయన లండన్ ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు మంత్రులు పలు పొంతన లేని వివరాలు చెప్పారు. వెరసి… సీఎం లండన్ పర్యటన మిస్టరీగా మిగిలిపోయింది. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్తానన్న ఆయన… మధ్యలో లండన్‌లో ఎందుకు ఆగారు? ఈ ప్రశ్నలకు మంత్రులు తమకు తోచిన సమాధానం చెప్పారు.
కానీ… ‘లండన్ మిస్టరీ’ వీడకపోగా, మరిన్ని అనుమానాలు తలెత్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… జగన్ దంపతులు తమ కుమార్తె కోసమే లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కుమార్తెలను విమానంలో ఎక్కించుకుని… స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలిసింది.ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలో అంతులేని గోప్యత ఎందుకు ప్రదర్శించారు? తొలుత లండన్‌కు వెళ్లి, అక్కడి నుంచి దావోస్ చేరుకుంటారని చెబితే పోయేదేముంది? అనవసరమైన అనుమానాలకు ఎందుకు తావివ్వాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదిక అయిన దావోస్… జూరెక్ నగరానికి 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దావోస్ సదస్సుకు హాజరయ్యేవారంతా జూరెక్ విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి రోడ్డు మార్గంలో కాని, రైలులో కాని దావోస్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన కూడా అలాగే సాగుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. కానీ అందుకు విరుద్ధంగా పర్యటన జరగడమే ఇప్పుడు వీడని మిస్టరీగా ఉంది.
Also Read: Jagan Davos Tour: దావోస్ కు కుబేరులు వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ వెళ్లాడా?
మంత్రుల విభిన్న ప్రకటనలు..
దీనిపై మంత్రులు తలోలాగా మాట్లాడుతున్నారు. తొలుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమా నం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీనివల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం ఆలస్యమైంది. లండన్‌లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అక్కడ కూడా ఆలస్యమైంది. జూరెక్‌లో ల్యాండింగ్ కోసం మళ్లీ అధికారులు విజ్ఞప్తి పెట్టారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10గంటల తర్వాత జూరెక్‌లో విమానాల ల్యాండింగ్‌ను చాలా ఏళ్లనుంచి నిషేధించినట్లు స్విస్ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. దీంతో లండన్‌లోనే సీఎంకు బస ఏర్పాటు చేశారు’’ అని బుగ్గన వివరించారు. ఆ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అచ్చం ఇదే వివరణ ఇచ్చారు.మంత్రులు చెప్పినట్లుగా… ఇంధనం నింపుకోవడం కోసం టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్లడం వరకు ఓకే! కానీ… అక్కడి నుంచి ప్రత్యేక విమానం నేరుగా జూరెక్ వెళ్లకుండా, లండన్ ఎందుకు వెళ్లింది? ముఖ్యమంత్రి లండన్‌కు ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నకు మాత్రం మంత్రులు సమాధానమివ్వలేదు. ‘ఎయిర్ రూట్’ చూస్తే… బల్గేరియా, సెర్బియా, స్లొవేనియా మీదుగా స్విట్జర్లాండ్‌కు నేరుగా వెళ్లిపోవచ్చు. అటూ ఇటుగా 3 గంటల ప్రయాణం! అలా చేస్తే… అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య జూరెక్‌లో ల్యాండ్ అయ్యే అవకాశముంది. కానీ… మరో గంట అదనంగా ప్రయాణించి, ఫ్రాన్స్‌ను దాటి లండన్‌లో ఎందుకు దిగారన్నదే ప్రశ్న. ‘లండన్‌లో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉన్నందునే ఆలస్యమైంది. దీంతో అక్కడే సీఎం బస చేయాల్సి వచ్చింది’ అని మంత్రులు చెప్పారు. అంతేతప్ప… ఇస్తాంబుల్ నుంచి నేరుగా జూరెక్ వెళ్లకుండా, అదనపు ప్రయాణం చేసి లండన్ ఎందుకు వెళ్లారో మాత్రం చెప్పలేదు.
ప్రత్యేక విమాన ఖర్చు రూ.5 కోట్లు
దావోస్ వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఉపయోగించిన ప్రత్యేక విమానం ఎంబ్రాయిర్ లీనేజ్ 1000. ప్రపంచంలోని టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు గంటకు సుమారు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. అంటే… ముఖ్యమంత్రి దంపతులు గన్నవరం నుంచి లండన్‌కు వెళ్లడానికి అయిన ఖర్చు… రూ1.56 కోట్లు. ఆ తర్వాత… జూరెక్ ప్రయాణం, బస, తిరుగు ప్రయాణం… ఇవన్నీ కలిపితే ప్రత్యేక విమానం కోసం పెడుతున్న ఖర్చు దాదాపు రూ.4 కోట్లు. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పు డు… ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాలు వాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు’’ అని విమర్శించేవారు. కానీ… చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు ఎప్పుడూ ప్రత్యేక విమానాల్లో వెళ్లలేదు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లి… అక్కడి నుంచి జూరెక్‌కు ప్రయాణికుల విమానాన్నే ఎక్కేవారు. ఒకే ఒక్కసారి… రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాల్సి ఉండటంతో, ప్రయాణ సమయం కలిసి వస్తుందని జూరెక్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో తిరిగి వచ్చారు. మరోవైపు… చంద్రబాబు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఎప్పుడెళ్లినా షెడ్యూలు ప్రకారమే ప్రయాణించారు. అధికారిక పర్యటనలో విశేషాలను, ఎక్కడికి ఎప్పుడు చేరుకున్నది, ఎవరిని కలుస్తున్నది ట్విటర్ ద్వారా అందరికీ తెలియచేసేవారు. అధికారిక ప్రకటనలో ఒకలా, ప్రయాణం మరోలా… ఎప్పుడూ జరగలేదు.
Also Read: YCP MLC Udaya Bhaskar: ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఏ1 నిందితుడిగా కేసు నమోదు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap cm lands unscheduled in london
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com