ఇది మామూలు విషయం కాదు. నాకు తెలిసి సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై, మొత్తం రాష్ట్ర న్యాయ వ్యవస్థ మీద ఈ స్థాయి ఆరోపణలు స్వాతంత్ర భారతావని లో ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇది నిజంగా సాహసమే. ఈ ఆరోపణలు కేవలం కాకి లెక్కలు, బూటకపు సాక్ష్యాలతో కూడుకొని వుంటే జగన్ పదవికే ముప్పు వస్తుంది. లేదంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ పదవికి ముప్పు వచ్చే అవకాశం వుంది. అదేమిజరుగుతుందో గాని ఇది న్యాయ వ్యవస్థపై దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అసలు భారత న్యాయ వ్యవస్థ అనేక లోపాలతో కూడుకుంది. పేద వాడికి న్యాయం అందుబాటులో లేకపోవటం ఒకెత్తయితే పెద్ద వాడు న్యాయాన్ని హైజాక్ చేయటం మరొక ఎత్తు. అందుకే న్యాయ వ్యవస్థ ఎన్నో సార్లు విమర్శలకు గురవుతుంది. అంతమాత్రాన అంతా చెడ్డగా వుందని అనటం కూడా న్యాయ వ్యవస్థకు అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. ఎన్నోసార్లు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ తమ అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు వాటిని దారిలో పెట్టిన సంఘటనలు వున్నాయి.
Also Read: జగన్ కు హైకోర్టులో మరో దెబ్బ.. ఈసారి ప్రజలకు షాకే?
అదేసమయంలో న్యాయం సరైన సమయంలో అందుబాటులో లేక అన్యాయానికి గురైన సంఘటనలూ వున్నాయి. న్యాయం జరగదనుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఏదోవిధంగా సంవత్సరాల తరబడి న్యాయాన్ని వాయిదా వేయించుకోగలగటం సర్వసాధారణమైపోయిందనే విమర్శను న్యాయ వ్యవస్థ మూటగట్టుకుంది. ఇందులో వాస్తవముందని ప్రతివాళ్ళకి అర్ధమవుతుంది. ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వులు ( ఓ సంవత్సరం లోపల ప్రజా ప్రతినిధుల నేర విచారణ పూర్తి చేయాలనే ఆదేశం) సముద్రం మీద నీటి బొట్టు లాంటిదే. ఎందుకంటే ఒక్క ప్రజా ప్రతినిధులే కాదు ఎంతోమంది ఆర్ధిక నేరస్తులు, హత్యారోపణలు లాంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కుంటున్న వారు ఎంతోమంది ఇప్పటికీ న్యాయాన్ని వాయిదా వేయించు కోగలుగుతున్నారు. మరి ఈ కేసులన్నిటి మాటేంటి? వీటికి పరిష్కారం ఎక్కడ? చివరకు ప్రజాప్రతినిధుల విషయం లో కూడా ఇంతకు ముందు ఎప్పుడో ఈ సంగతి సుప్రీం కోర్టు ప్రస్తావించింది. అయినా ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు మరుగున పడింది? ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఓ అంతులేని కధ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేవనెత్తిన ఆరోపణలేమిటి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నుతుందని తీవ్ర ఆరోపణ చేసాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో వున్న అయిదు సంవత్సరాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, అవినీతిని పెంచి పోషించాడని వాటిపై విచారణ చేపడితే హైకోర్టు అడ్డుపడుతుందని తీవ్ర ఆరోపణలు చేశాడు. అమరావతి భూకుంభకోణంలో చంద్రబాబు నాయుడు, తన అనుచరుల పాత్ర వుందని, షుమారు నాలుగువేల ఎకరాలు రాజధాని ని ప్రకటించక ముందే తమ అనుయాయులకు కట్టబెట్టాడని ఆరోపించాడు. ఇందులో ప్రస్తుత సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ల పాత్ర వుందని కూడా ఆరోపించాడు. స్వయంగా న్యాయమూర్తి రమణ కుమార్తెల పేరుతో కొంత భూమిని కూడా కొన్నారని , దమ్మాలపాటి శ్రీనివాస్, రమణ లు కలిసి సంయుక్తంగా ఈ భూ కుంభకోణంలో వున్నారని సోదాహరణంగా వివరించాడు. చంద్రబాబు నాయుడు , తన అనుచరులపై దాఖలైన కోర్టుల్లో ఆ కేసులు తమ అనుకూల న్యాయమూర్తుల బెంచీలకు ప్రధాన న్యాయమూర్తి కేటాయించేటట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేసాడని కూడా తీవ్ర ఆరోపణలు చేసాడు. చివరకు భూ కుంభకోణం దర్యాప్తు జరగనివ్వకుండా ఆదేశాలివ్వటమే కాకుండా ఈ వార్తలు ఏ మాధ్యమం లోనూ రాకూడదని కూడా ఆదేశాలివ్వటం జరిగిందని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే దృష్టికి తీసుకెళ్ళాడు. ఈ వ్యాఖ్యానాలు, ఆరోపణలు దేశాన్ని ఒక కుదుపు కుదిపాయని చెప్పొచ్చు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసం చేయలేదు. దీన్ని అనుకూలురు ధైర్యవంతుడుగా అభివర్ణిస్తుంటే వ్యతిరేకులు ఇదో పధకం ప్రకారం చేసాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై సుప్రీం కోర్టు స్పందించలేదు. అందరూ సుప్రీం కోర్టు ఎలా ప్రతిస్పందిస్తుందోనని ఆతురతతో , వుద్విగ్నంతో ఎదురు చూస్తున్నారు.
ఈ సంఘటనను ఎలా చూడాలి?
ఇది ఆషామాషీ సంఘటన కాదు. ఇప్పటివరకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలపై వచ్చిన అనేక సందేహాలకు ఇందులో సమాధానాలు రాబట్టాల్సి వుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించినట్లు కార్యనిర్వాహక వర్గం తప్పుచేస్తే అయిదు సంవత్సరాల కొకసారి ప్రజలకు జవాబు చెప్పాల్సి వుంది, కోర్టులకు జవాబు చెప్పాల్సి వుంది. అదే న్యాయమూర్తులు తప్పుచేస్తే వాళ్ళ అంతరాత్మనే జవాబు చెప్పాల్సి వుంది. ఇది వాస్తవం. వ్యవస్థల్లో ఎక్కడోచోట జవాబుదారీతనం లేకపోతే ఎలా? న్యాయమూర్తులు కూడా మనుషులే కదా? వాళ్లకు మిగతావాళ్లకు వున్నట్లు రాగద్వేషాలు, మన తన లేకుండా ఉంటాయా? మరి అవి ప్రదర్శించినప్పుడు నిష్పక్షత లోపిస్తుంది కదా. అది చెక్ చేసేదెవరు? ఈ ప్రశ్నలు చాలాకాలం నుంచి అనేకమంది లేవనెత్తుతున్నారు. వీటికి సమాధానాలు లేవా? ప్రస్తుత ఆరోపణలు నిర్దిష్టమైనవి. ప్రస్తుత హైకోర్టు లోని న్యాయమూర్తుల నియామకం దగ్గర్నుంచి, న్యాయమూర్తి రమణ ఆస్తి, అప్పుల నివేదికలు, న్యాయమూర్తి రమణ, దమ్మాలపాటి శ్రీనివాస్ భూ వివరాలు అన్నీ పొందుపరుస్తూ ఆరోపణలు చేయటం జరిగింది.
Also Read: జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డ ‘కోర్టు’లో బంతి?
వీటికి సమాధానం చెప్పకుండా జగన్ పై సిబీఐ కేసులున్నాయి కాబట్టి తను చేసే ఆరోపణలకి విలువలేదని ఎవరైనా అంటే అది వాళ్ళ అవివేకం. ఆయనమీద కేసులుంటే అవి విచారణకు వస్తాయి. శిక్షలు ఖరారవుతాయి. దానికి దీనికి పొంతనలేదు. ఆరోపణలు నిర్దిష్టంగా వుంటే ఎంతటివారైనా వాటిపై విచారణను ఎదుర్కోవాల్సిందే. అందునా ప్రజలచేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రినే స్వయంగా ఈ ఆరోపణలు చేస్తే ఎవరూ విస్మరించలేరు. వీటికి సమాధానాలు రాబట్టాల్సిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ఆరు నెలల్లో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించాల్సిన వ్యక్తి. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత వీటిపై సరైన విచారణ జరగకుండా ఆ పదవిలో కూర్చోలేరు. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కి, న్యాయ వ్యవస్థకే ఇది పెద్ద సవాలు. శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ తప్పుచేస్తే న్యాయం కోసం మనం అర్దించేది న్యాయ వ్యవస్థనే. అటువంటిది ఈ వ్యవస్థపై నమ్మకం పోకుండా చూడాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయ స్థానం లోని న్యాయమూర్తులపై వుంది. అలా జరగకపోతే దేశ వ్యవస్థల పైనే ప్రజలకు నమ్మకం పోతుంది. అలా జరగదని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Ap cm allegations against judiciary shook nation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com