ZPTC Election Counting: ఏపీలో( Andhra Pradesh) ఉత్కంఠ కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఈనెల 12న అక్కడ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల జడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఒంటిమిట్టలో జడ్పిటిసి గా ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికల కావడంతో రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ రెండు స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవే. దీంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థులను ప్రకటించింది. టిడిపి సైతం తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దించింది. ముఖ్యంగా పులివెందులలో పోరు హోరాహోరీగా సాగింది. పోలింగ్ నాడు అనేక రకాల ఘటనలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ రెండు చోట్ల రీపోలింగ్ జరిపింది. అయితే రీ పోలింగ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
* భారీ భద్రత నడుమ..
ఈరోజు కడప( Kadapa ) మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ ను 10 టేబుళ్ల పై ఒకే రౌండ్లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టకు సంబంధించిన మాత్రం పది టేబుళ్ల పై మూడు రౌండ్లలో లెక్కించనున్నారు. అయితే ముందుగా పులివెందుల ఫలితం వచ్చే అవకాశం ఉంది. అక్కడ కేవలం 7000 పైచిలుక ఓట్లు పోలింగ్ కావడంతో.. కొద్దిసేపటికి ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఒంటిమిట్టలో 26 వేల వరకు ఓట్లు ఉండగా.. 86% పోలింగ్ జరిగింది. దీంతో అక్కడ ఫలితం మధ్యాహ్నం కి వచ్చే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ స్టాటస్టికల్ అధికారులు ముగ్గురు, ఇతర సిబ్బందితో కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు.
* ఫలితాలపై స్పష్టత..
అయితే ఫలితాలపై ఒక స్పష్టత ఇప్పటికే వచ్చింది. పోలింగ్ నాడు జరిగిన పరిణామాలు, తరువాత రోజు రీపోలింగ్ను వైసీపీ( YSR Congress ) బహిష్కరించడం, పులివెందుల ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటివి చూస్తుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదని స్పష్టమవుతుంది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలో భారీ ధీమా ఉంది. ముఖ్యంగా పులివెందులలో పార్టీ కీలక నేత బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి రంగంలో ఉన్నారు. ఆమె తరపున అధికార పార్టీకి చెందిన కూటమి నేతలంతా ప్రచారం చేశారు. అయితే అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసిపి ఆరోపిస్తోంది. కానీ దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని టిడిపి చెబుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పులివెందుల ఫలితం పై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. చూడాలి విజేత ఎవరు అవుతారో?