Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy Vs YV Subba Reddy : విజయసాయిని వెంటాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

Vijayasai Reddy Vs YV Subba Reddy : విజయసాయిని వెంటాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

Vijayasai Reddy Vs YV Subba Reddy : వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య వివాదం ముదురుతోందా? విశాఖపై ఆధిపత్యానికి ఇరువురు ప్రయత్నిస్తున్నారా? హైకమాండ్ సైతం కలవరపాటుకు గురవుతోందా? మున్ముందు యుద్ధం పతాక స్థాయికి చేరనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి విజయసాయిరెడ్డిని తొలగించి వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే, విశాఖలో విజయసాయి భూ వ్యవహారాలపై ఆరోపణలు రావడం, వైవీని తెరపైకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వైవీ, విజయసాయిల మధ్య అగాధం పెంచింది.

అయితే ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి పార్టీలోని విజయసాయిరెడ్డి మనుషులను ఏరివేస్తున్నారు. ఇప్పటికీ విజయసాయిరెడ్డిని ఆరాధిస్తున్న ఓ కార్పొరేటర్, డివిజన్ ఇన్ చార్జిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో వీరిద్దరూ విజయసాయి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలే. సహజంగా ఇది విజయసాయికి మింగుడు పడడం లేదు. వైవీ చర్యలపై చిటపటలాడుతున్నారు. అయితే విశాఖలో విజయసాయి ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ప్రయత్నంలో వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు కొత్తగా విజయసాయి భూ వ్యవహారాలు, బినామీలపై వైవీ ఫోకస్ పెంచారు. ఏకంగా దాడులు చేయిస్తున్నారు. తాజాగా ఐటీ అధికారులు హాయగ్రీవ ఇన్ఫ్రాటెక్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది విజయసాయి బినామీ అని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. హాయ గ్రీవ మెనేజింగ్ డైరెక్టర్ జగదిశ్వరుడు, పున్నం నారాయణ రావు, రాధరాణి చిలుకూరి, అడిషనల్ డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తి, ఇంద్ర కుమార్ చితూరి , నారాయణ రావు గున్నం ఇళ్లలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

సాగర నగరంలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొనుగోలు చేశారు.  వయోవృద్ధులకు హౌసింగ్‌ ప్రాజెక్టు కోసమని ప్రభుత్వం కూడా తక్కువ ధరకు భూమిని అప్పగించింది.  మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీని వెనుక విజయసాయిరెడ్ ఉన్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఇప్పుడు వైవీ, విజయసాయిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న తరుణంలో హయగ్రీవలో సోదాలు జరుగుతుండడం విశేషం. ఇదంతా విజయసాయిరెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకేనన్న టాక్ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular