Vijayanagaram Land Issue: రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేది ఒక నానుడి. కానీ విజయనగరంలో మాత్రం రాజుల సొమ్ము వైసిపి పాల్లు అనేది కొత్త మాట. రాజులకు చెందిన ఎకరా భూమిని అడ్డగోలుగా పొంది ఏకంగా వైసిపి కార్యాలయాన్ని నిర్మించారు విజయనగరంలో. అధికారంలో ఉన్నప్పుడు అన్ని సవ్యంగా సాగిపోతాయి కానీ.. ఇప్పుడు విజయనగరం రాజు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రైవేటు భూమిగా ఉన్న సంస్థానం స్థలాన్ని.. ప్రభుత్వ భూమిగా మార్చేసి.. ప్రభుత్వం నుంచి 33 ఏళ్లకు లీజుకు పొంది.. ఏకంగా కార్యాలయాన్ని నిర్మించేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు దానిపై ఫిర్యాదు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
* ప్రభుత్వ భూములు లీజులకు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరో 30 సంవత్సరాలు పాటు తామే అధికారంలో ఉంటామని జగన్ ప్రకటనలు కూడా చేశారు. అయితే ప్రతి జిల్లాకు ఒక భారీ కార్యాలయాన్ని నిర్మించాలని భావించారు. దాదాపు అన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలను లీజు రూపంలో కేటాయించి కార్యాలయాలను నిర్మించారు. కానీ కూటమి వచ్చిన తరువాత ఈ కార్యాలయాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు జారీ అయ్యాయి. అయితే తాజాగా విజయనగరంలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రైవేటు స్థలంలో నిర్మించేసారని.. అది సంస్థానానికి చెందినది అని.. ప్రైవేటు స్థలం అని.. విజయనగరం రాజవంశీయులు పూసపాటి అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
* నగరం నడిబొడ్డున..
విజయనగరంలోని నగరం నడిబొడ్డున వైసిపి కార్యాలయ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వ భూమి అంటూ ఎకరా స్థలాన్ని కేటాయించారు 2022లో. 33 ఏళ్ల పాటు లీజుకు..రూ.33,000 తీసుకొని ప్రభుత్వమే ఆ భూమి కేటాయించింది. పేదల భూముల్లో సవాలక్ష నిబంధనలతో ఇబ్బంది పెట్టే అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.. ఒక ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపి వైసిపికి కేటాయించారు. పోనీ ప్రభుత్వ భూమిగా మార్చిన క్రమంలో ఆ ప్రైవేటు భూమికి చెందిన వ్యక్తులకు, సంస్థలకు కనీసం నోటీసులు ఇచ్చారా? అంటే అది కూడా లేదు. కానీ ఎంచక్కా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించేశారు. వాస్తవానికి ఆ భూమి విజయనగరం రాజులకు చెందినది. దాదాపు 4.78 ఎకరాల భూమి ఉండగా అందులో ఎకరా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపి ఇచ్చేశారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఫిర్యాదుతో ఇదో సంచలన అంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
