YSRCP Vanga Geetha: వంగా గీత( Vanga geeta) పార్టీ మారుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతారా? అందుకే పార్టీలో కనిపించడం లేదా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. గత కొంతకాలంగా వంగా గీత యాక్టివ్ గా లేరు. పిఠాపురం నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. దీంతో పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల సమయంలో సైతం పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థిగా ఉన్న వంగా గీత విషయంలో అలానే మాట్లాడారు. ఆమె చాలా మంచి మనిషిగా చెప్పుకొచ్చారు. ఆమె ఎన్నికల తరువాత జనసేన లోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు వంగా గీత ఫుల్ సైలెన్స్ పాటిస్తుండటంతో పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె టిడిపి కంటే జనసేనలో చేరుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే జనసేనలో చేర్చి ఆమెకు కీలక పదవి ఇస్తారని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది.
టిడిపిలో సుదీర్ఘకాలం..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు వంగా గీత. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె పనిచేస్తూ వచ్చారు. కానీ 1995లో ఆమె జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. అటు తరువాత తెలుగుదేశం పార్టీ ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చింది. 2006 వరకు వంగా గీత రాజ్యసభ సభ్యురాలిగా.. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆ పార్టీలో చేరారు గీత. ఆ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. 2019లో మాత్రం కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో జగన్ ఒత్తిడి మేరకు పవన్ పై పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పిఠాపురంలో కనిపించని కార్యక్రమాలు..
ఎన్నికల ఫలితాలు వచ్చి 18 నెలలు దాటుతోంది. ఆమె మాత్రం పిఠాపురంలో( Pithapuram) పెద్దగా కనిపించడం లేదు. మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన సమయంలో మాత్రం కనబడ్డారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు సైతం పెద్దగా జరగడం లేదు. అయితే ఆమె పార్టీలో కొనసాగడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆపై జనసేనలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పవన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ పరిణామ క్రమంలో సరైన సమయంలో జనసేనలో చేరుతారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.