YCP: టిడిపికి జీరో.. వైసీపీకి 11

ఒక్కో రాజ్యసభ స్థానానికి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు. అదే సమయంలో వైసీపీ నుంచి మరో నలుగురు టిడిపిలోకి వచ్చారు.

Written By: Dharma, Updated On : February 21, 2024 10:11 am
Follow us on

YCP: ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సీఎం రమేష్, కనకమెడల రవీంద్రల పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ 3 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి,మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు లను సీఎం జగన్ ఎంపిక చేశారు. సంఖ్య బలంగా వైసీపీకి మూడు స్థానాలు కచ్చితంగా దక్కాలి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి సైతం పోటీలో ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల ముంగిట ఆ సాహసం చేయకూడదని చంద్రబాబు భావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలో పడినట్లు అయ్యింది.

ఒక్కో రాజ్యసభ స్థానానికి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు. అదే సమయంలో వైసీపీ నుంచి మరో నలుగురు టిడిపిలోకి వచ్చారు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. చాలామంది సిట్టింగులకు స్థానచలనం కల్పించారు. మరికొందరికి పక్కన పెట్టారు. ఈ పరిణామాలతో వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు వస్తారని చంద్రబాబు భావించారు. అయితే టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసిపి పట్టు పట్టింది. అదే సమయంలో వైసీపీలోకి వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటుకు టిడిపి డిమాండ్ చేసింది. మూడేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముంగిట గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో టిడిపి బలం 18 కి పడిపోయింది. రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే ఇంకా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల ముంగిట అంత రిస్క్ చేయడం సాహసం గా భావించిన చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం తొలిసారి. 1983 ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టింది. ఈ నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఓటములు ఎదురయ్యాయి. కానీ ఏనాడూ రాజ్యసభ ప్రాతినిధ్యం లేకుండా లేదు. రాజ్యసభ సీటుకు తగ్గట్టు ఎమ్మెల్యేల సంఖ్యను తెలుగుదేశం పార్టీ గెలుచుకునేది. కానీ గత ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితం అయింది. దీంతో రాజ్యసభ ప్రాతినిధ్యానికి తగ్గట్టు సంఖ్యాబలం లేకుండా పోయింది. అటు పార్టీలో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు గత ఎన్నికల అనంతరం బిజెపిలో చేరారు. ఉన్న ఒకే ఒక సభ్యుడు కనకమెడల రవీంద్ర పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు పోటీలో లేకపోవడంతో టిడిపికి రాజ్యసభలో సభ్యులు లేనట్టే. మరోవైపు వైసీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆ పార్టీకి రాజ్యసభలో బలం 11 కు పెరిగింది.