YCP: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి కాలకేయ సోషల్ మీడియా సైన్యం ఉంది. ఆ పార్టీ ప్రారంభం నుంచి సోషల్ మీడియా అండదండలుగా నిలుస్తూ వస్తోంది. అన్నింటికీ మించి మనసుపెట్టే వైసిపి శ్రేణులు సోషల్ మీడియా విభాగానికి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్యం స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యానించినా.. ప్రభుత్వ వైఫల్యాలు కనిపించిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఎంతో కొంత ఉపాధి చూపించేవారు. జీతంతో పాటు గౌరవ వేతనం అందించేవారు. కానీ ఎందుకో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోషల్ మీడియా విభాగాన్ని పట్టించుకోలేదు. అందులో పని చేస్తున్న వారంతా స్వచ్ఛందంగా చేస్తున్నారే తప్ప.. శాశ్వతంగా చేయలేకపోతున్నారు. మరికొందరైతే మరో ఉపాధి మార్గం లేక.. జగన్ అధికారానికి దూరమయ్యారని.. కూటమి అధికారంలోకి వచ్చిందన్న బాధతో ఆసుపత్రి పాలవుతున్నారు. వారిని సైతం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు.
* బాధితులుగా మారి..
ఇటీవల సోషల్ మీడియాలో( social media) వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసిన వారు ప్రత్యక్షమవుతున్నారు. చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి పోస్టులు చేసిన వారు ఉన్నారు. కూటమి పార్టీల నేతలతో పాటు వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించిన వారు సైతం ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. జైలకు వెళ్లి రోజుల తరబడి బెయిల్ రాక.. కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అటువంటివారు బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తాము చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్సలు అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో అదే జరిగింది. ఆయన తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిని అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అదే బోరుగడ్డకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. అంతెందుకు వైసిపి హయాంలో ఎంపీగా వ్యవహరించిన నందిగాం సురేష్ సైతం తన విషయంలో పార్టీ ఏం చేయలేదని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.
* హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్..
కృష్ణారెడ్డి( Krishna Reddy) అనే వ్యక్తి అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లారు. ఈ క్రమంలో వైసిపి సోషల్ మీడియా వారియర్ గా మారారు. కూటమినేతలను ట్రోల్ చేయడం, అసభ్యంగా పోస్టులు పెట్టడం వంటివి విదేశాల నుంచి చేస్తుండేవారు. ఆయనకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే అప్పటికే అమెరికాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు కృష్ణారెడ్డి వైద్య సాయం కోసం వెయ్యి డాలర్లు ఇచ్చారు. వ్యక్తిగత సాయం మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి ప్రాణాలు నిలిపేందుకు స్నేహితుల ప్రయత్నిస్తున్నారు. గో ఫండ్ మీ అనే పిలుపు ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నారు. రెండున్నర లక్షల డాలర్లు సాయం కావాలని కోరుతున్నారు. కొంతమంది స్పందించి ఇస్తున్నారు. అయితే ఒక్క కృష్ణారెడ్డిది ఈ పరిస్థితి కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసిన చాలామంది ది ఇదే పరిస్థితి. కేసులను ఎదుర్కొన్న వారికి న్యాయ సహాయం లేదు. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎటువంటి సాయం అందించడం లేదు. అయితే సగటు రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో పనిచేసే వారికి ఇది ఒక గుణపాఠమే.