Pilli Subhash Chandra Bose: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన ఓ ఎంపీ టీడీపీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. ఆయన ప్రకటనలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు ఆయన స్వయంగా చెప్పడంతో దీనిపై రకరకాల ప్రచారం మొదలైంది. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ ఏడాది జూన్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇంతలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే అది కూడా తన సొంత పార్టీ నేత అవినీతి వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తానని చెప్పడం వెనుక.. ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. వైసీపీ హయాంలో తాను ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. అందుకే తాను సీఎం చంద్రబాబును కలుస్తానని చెబుతున్నారు. అయితే ఆయన టిడిపిలో చేరుతారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తోంది.
* సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే..
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose). రాజశేఖర్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఆయన పని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభకు పంపించారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉండేవారు. కానీ వైసిపి హయాంలో ఆయన నియోజకవర్గంలో వేరే నేతకు నిలిపారు జగన్. ఆయన గెలిచేసరికి మంత్రి పదవి కట్టబెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆ నేత నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో తన సొంత నియోజకవర్గంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆ మంత్రిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అదే అంశంపై సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. అయితే సొంత పార్టీ నేతపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం ద్వారా సరికొత్త సంకేతాలు పంపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* కుమారుడి కోసం?
త్వరలో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే తన కుమారుడు రాజకీయం కోసం ఆయన సుదీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు రాజకీయ భవిష్యత్తుపై జగన్మోహన్ రెడ్డి సరైన భరోసా ఇవ్వకపోవడంతో.. ప్రత్యామ్నాయ ఆలోచన పై ఆయన దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పడం ద్వారా కొత్త సమీకరణలకు, కొత్త ప్రచారానికి తెర తీశారు పిల్లి సుభాష్ చంద్రబోస్. చూడాలి మరి ఏం జరుగుతుందో?