YCP Party : ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తన పార్టీతో పాటు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి జగన్ గైర్హాజరవుతూ వస్తున్నారు. మండలిలో సంఖ్యాబలం అధికంగా ఉండడంతో అక్కడ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అయితే అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న వైసిపి.. క్యాబినెట్ హోదా తో సమానమైన పీఏసీ చైర్మన్ అడుగుతోంది. గత 60 సంవత్సరాలుగా పదవిని విపక్షాలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సంఖ్యాపరంగా కనీస స్థాయిలో కూడా వైసీపీకి సీట్లు దక్కలేదు. ఆ పార్టీ కేవలం 11 అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. దీంతో పిఎసి చైర్మన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతోంది. అయితే చివరి నిమిషంలోనైనా తమకు అవకాశం ఇస్తారని వైసిపి భావించింది. కానీ కూటమి తరుపున 12 మంది నామినేషన్ వేయడంతో.. పీఏసీ చైర్మన్ తమకు రాదని తేలిపోయింది. దీంతో నామినేషన్లు వేసి మరి ఎన్నికలను బహిష్కరించింది వైసిపి. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* వైసీపీ నుంచి 3 నామినేషన్లు
పీఏసీ ఎన్నికల కోసం నిన్న వైసీపీ నామినేషన్లు దాఖలు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రామ సుబ్బారెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ నామినేషన్లు వేశారు. అధికారిక కూటమి 9 నామినేషన్లు దాఖలు చేసింది. దీంతో పిఎసిలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి తొమ్మిది నామినేషన్లు దాఖలు కావడంతో.. వారి సంఖ్య బలాన్ని అనుసరించి అందరూ ఎన్నిక కావడం లాంచనమే. కానీ వైసీపీ నుంచి దాఖలైన ముగ్గురి నామినేషన్లలో ఒక్కరే ఎన్నికయ్యే అవకాశం ఉంది. అందుకే వైసిపి ఈ ఎన్నికలను బహిష్కరించింది.
* గత ఆరు దశాబ్దాలుగా
వాస్తవానికి గత 60 సంవత్సరాలుగా ప్రతిపక్షానికే పిఎసి చైర్మన్ పదవి విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2019 ఎన్నికల్లో టిడిపి 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు పిఎసి చైర్మన్ గా అవకాశం ఇచ్చింది జగన్ సర్కార్. ఇప్పుడు కూడా వైసీపీకి విడిచి పెడతారని అంతా భావించారు. నిన్న సాయంత్రం వరకు అదే భావన వ్యక్తం అయింది. కానీ ఈరోజుకు సీన్ మారింది. జనసేనకు ఆ పదవి కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.