YCP activists: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి విపరీతమైన ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ ఉంది. సానుభూతి నడుమ ఏర్పడింది ఆ పార్టీ. రాజశేఖర్ రెడ్డి అనే బలమైన సానుభూతి పునాదులపై ఏర్పడిన ఆ పార్టీకి.. అన్ని వర్గాల్లో ఆదరణ ఉంది. రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి అంటే పీక కోసుకునే వర్గాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే అధినేత కోసం ఆలోచించే అభిమానులు ఉన్నారు కానీ.. అభిమానుల కోసం అధినేత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆలోచన చేయకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా జనసేన తమ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో చనిపోతే బీమా పరిహారం ఇచ్చింది. ఏకంగా 220 మందికి 11 కోట్ల రూపాయల వరకు అందించింది. ఇప్పటివరకు వెయ్యి మంది వరకు జనసేన నాయకత్వం సహకరించింది అంటే నిజంగా సాహసం అని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం ఇటువంటివి ఏవి పెట్టలేదు. అలాగని అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేదు. కానీ దానిని గుర్తించకుండా ఇప్పటికీ జగన్ అంటే పిచ్చి వ్యామోహంతో ఉన్నారు వైసిపి కార్యకర్తలు.
టిడిపి సభ్యత్వం తోనే బీమా
తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ పార్టీ సైతం కార్యకర్తలకు పెద్దపీట వేస్తోంది. లోకేష్ అయితే ప్రత్యేక ఆలోచన చేశారు. అమలు చేసి చూపించారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమాను కల్పించారు. ఇది నిజంగా అభినందించదగ్గ పరిణామం. 100 రూపాయలతో లక్షలాది రూపాయల బీమా సౌకర్యం పొందారు టిడిపి కార్యకర్తలు. అటు జనసేన సైతం ప్రమద బీమాను అమలు చేస్తోంది. ఏకంగా వారికి పరిహారం అందించి తన చిత్తశుద్ధిని చాటుతోంది. తాజాగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా వందలాదిమందికి బీమా పరిహారం అందించారు.
జగన్ రాజకీయం కోసం..
జగన్ తన రాజకీయం కోసం పార్టీ శ్రేణులను వాడుకున్నారు. జగన్ పై ఈగ వాలితే సహించరు కార్యకర్తలు. కానీ కార్యకర్తలు కష్టాల్లో ఉంటే మాత్రం వారికి ఆర్థిక లబ్ధి అందడం లేదు. వారి గురించి ఆలోచించేవారు సైతం కరువవుతున్నారు. సహజంగా ఎదుట పార్టీలు చేసే కార్యక్రమాలను నిశితంగా పరిశీలిస్తారు. ఒకవైపు సభ్యత్వం తోనే ప్రమాద బీమాను సొంతం చేసుకుంటున్నారు టిడిపి కార్యకర్తలు. ఇంకోవైపు జనసేనలో పార్టీయే సభ్యత్వం తీసుకున్న వెంటనే ప్రమాద బీమాను అందిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్త అన్నవాడికి ఎటువంటి ఆర్థికలబ్ది లేకపోతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పరా? లేకుంటే చెప్పినా ఆయన పట్టించుకోరా? అన్నది వారికే తెలియాలి.