Chevireddy Bhaskar Reddy: మద్యం కుంభకోణంలో( liquor scam) జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన తాను తప్పు చేయలేదని అరచి గోల పెట్టారు. కానీ ఆయన పాత్ర పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపంలో ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. కానీ న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. తాజాగా ఈరోజు ఆయన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని జైలు అధికారులకు చెప్పడంతో.. వారు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా రిమాండ్ ఖైదీగా ఉంటూ ఆసుపత్రులకు వెళ్లడం ఇది కొత్త కాదు. గతంలో చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల జరిగింది కానీ.. భాస్కర్ రెడ్డి విడుదల మాత్రం జరగడం లేదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఆయన నేను తప్పు చేయలేదు అంటూ అరిచారు. అందర్నీ గుర్తుపెట్టుకుంటానని..ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ శాపనార్ధాలు పెట్టారు. తనకు ఏ పాపం తెలియదని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే కోర్టులో వరుస బెయిల్ పిటిషన్లు.. ఎప్పటికప్పుడు అనారోగ్యం పేరుతో ఆసుపత్రులకు వెళ్తుంటే మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
తేలిగ్గా తీసుకున్న వైసీపీ..
మద్యం కుంభకోణాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే ఇక కుంభకోణం ఎలా అని ప్రశ్నించింది. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం పై మాట్లాడారో.. అప్పటినుంచి అరెస్టుల పర్వం మరింత ముందుకు సాగింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించగలిగింది ప్రత్యేక దర్యాప్తు బృందం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా పావులు కదిపింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితుల అరెస్టు జరిగింది. అయితే అలా పట్టుబడిన నిందితుల నుంచి కూడా సమాచారం రాబట్టింది సిట్. కచ్చితంగా బెయిల్ పై విడుదలైన వారు ఒకలా.. బెయిల్ లభించని వారు ఒకలా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరికి అనుమానం కలిగేలా ఈ విచారణ తీరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తమ సమాచారాన్ని తమ వారే అందించారన్న అనుమానం కూడా ఉంది. ఆపై మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్మోహన్ రెడ్డి అస్సలు పరామర్శించడం లేదు. దీంతో అరెస్ట్ అయిన వారిలో అభద్రతాభావం కూడా పెరుగుతుంది.
ఆయన తప్ప అందరూ బెయిల్ పై..
ఈ స్కామ్ లో అప్పటి సీఎంవో అధికారి ధనుంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సైతం అరెస్టయిన వారిలో ఉన్నారు. అయితే వీరు కొద్ది రోజులకే బెయిల్ పై బయటకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి సైతం బెయిల్ లభించింది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి మాత్రం బెయిల్ రాలేదు. ఆపై ఆస్తులను అటాచ్ చేశారు. ఇంత జరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సరైన సహకారం అందడం లేదన్న విమర్శ ఉంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉంటూ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారన్న ప్రచారం సాగుతోంది. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం.. జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. మరి ఆయన ఈ కేసులో ఎప్పుడు బయట పడతారో చూడాలి.