YSRCP Leaders DSC Candidates: సోషల్ మీడియా యుగం ఇది. సమాజంలో ఏ తప్పు జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ చెక్ సైతం క్షణాల్లో వాలిపోతుంది. సమాజంలో తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు అటువంటి పనిలోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నఫలంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావాలి. కూటమిలోని మూడు పార్టీలు విడిపోవాలి. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు పెద్ద ఎత్తున బయటపడి ప్రజలు తిరస్కరించాలి. ఆ ఆలోచన తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆ పార్టీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. తాజాగా డీఎస్సీ 2025 పై కూడా అదే మాదిరిగా విషప్రచారం చేస్తోంది.
* గత ఏడాది ఉపాధ్యాయ నియామకాలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు తొలి ఫైల్ గా డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఏడాది వ్యవధిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. వారి నియామకం జరిగి ఏడాది పూర్తవుతోంది. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. పేపర్ లీకేజ్ జరిగిందని.. వివరాలు వెబ్సైట్లో డిలీట్ చేశారని ఆరోపిస్తూ రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దీనిపై ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పేపర్ లీకేజీ, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు, రాంకర్ల విషయంలో అనుసరించిన తీరు, రోస్టర్ పద్ధతి వంటి వాటిపై పూర్తి స్పష్టతనిచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదేపనిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
* కేవలం గందరగోళానికి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తోంది. పోతే 16 వేల కుటుంబ ఓట్లు.. వస్తే ఆరు లక్షల కుటుంబాల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. కానీ డీఎస్సీ అభ్యర్థుల ముసుగులో ఉన్నది వైసీపీ నేతలే. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం వారే. ఇప్పుడు ఎక్కడికి అక్కడ ఆ నిజం బయటకు వస్తోంది. పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారిని డీఎస్సీ అభ్యర్థులుగా చూపి వారితో మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అవుతున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఇటువంటి ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగుతోంది. మరోవైపు అనుకూల సోషల్ మీడియా కూడా రంగ ప్రవేశం చేసింది. దీంతో వైసిపి ప్రయత్నాలు బట్టబయలు అవుతున్నాయి.
