Chaganti Koteswara Rao: కొందరు ఫోబియా తో బాధపడుతుంటారు. అదే తెలుగులో ఆత్మనూన్యత భావం. ఎదుటివారు తమ గురించే మాట్లాడుకుంటారు అనేది వారి భావన. ఇప్పుడు అటువంటి పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కనిపిస్తోంది. ఎవరైనా ప్రముఖులు మాట్లాడితే అది తమ అధినేత గురించి అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే తప్పు అని చెప్పలేం కానీ.. ఆ వ్యాఖ్యలు తమ అధినేతకు దగ్గరగా ఉండడంతో వారు రియాక్ట్ అవుతున్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో సైతం అలానే చేశారు. ఇప్పుడు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి అలానే కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే అలా స్పందించే క్రమంలో సమాజంలో ఉన్న తటస్తులు, మేధావి వర్గాలకు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దూరం చేస్తున్నారు. దానిని నియంత్రించుకోకుంటే మాత్రం ఇబ్బందికరమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా ఆ పార్టీలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
రజినీకాంత్ ను వెంటాడిన మూక
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు హాజరయ్యారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ). ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక్క మాట కూడా అనలేదు. చంద్రబాబుతో ఉన్న తన సన్నిహిత్యాన్ని గుర్తుచేసుకొని ఆయన పాలనలో జరిగిన మంచిని ప్రస్తావించారు. అది మొదలు వైసీపీ సేన ఆయనపై విరుచుకుపడింది. కొడాలి నాని లాంటి నేత రజినీకాంత్ శరీర ఆకృతి పై కూడా మాట్లాడారు. సూపర్ స్టార్ అని చూడకుండా చాలా చులకన భావంతో వ్యాఖ్యానాలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైతం రజనీకాంత్ పై రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే గుణపాఠా లు నేర్చుకోలేదు.
తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్పడం తప్పా..
తాజాగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ( Chaganti Koteswara Rao )కుటుంబ విలువల గురించి మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల.. తోబుట్టువుల పట్ల గౌరవంగా ఉన్న నాడే సమాజం బాగుంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రవచనకర్త చాగంటి ఇప్పుడే ఆ విషయం చెప్పలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చంద్రబాబు పట్ల గౌరవంతో మాట్లాడేసరికి.. ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అయ్యేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూక దాడి చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. విద్యార్థులకు నైతిక విలువల బోధన చేస్తున్నారు చాగంటి. అయితే తల్లిదండ్రులను గౌరవభావంతో చూడాలని చాగంటి చెప్పుకొచ్చారు. అందులో తప్పు ఏముందో అర్థం కావడం లేదు. అంటే తల్లిదండ్రులను గౌరవించమంటే అది జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు అర్థం చేసుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలను తరిమేశారన్న విమర్శ జగన్ పై ఉంది. దీంతో చాగంటి వారి మాటలు వీరికి ఇబ్బంది తెచ్చి పెట్టినట్టు ఉన్నాయి. మొత్తానికి అయితే సమాజ ప్రముఖులు ఏం మాట్లాడినా అందులో ద్వంద అర్ధాలు వెతికే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ తీరు మార్చుకోకుంటే మాత్రం ఆ పార్టీకే నష్టం.