Police vs YSRCP leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. సాధారణంగా విపక్షంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. అందులోనూ పోలీసుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పాము విపక్షంలో ఉన్నామన్న సంగతి మరిచిపోతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి సామాన్య నాయకుడి వరకు అందరూ పోలీసులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసిపి మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా పోలీస్ అధికారిపై దూసుకొచ్చారు. ఒక సీఐ స్థాయి అధికారిపై విరుచుకుపడ్డారు. ఏం చేస్తావయ్యా.. నువ్వేం చేస్తావ్ అంటూ దగ్గరగా అరుస్తూ సీఐపై దూసుకెళ్లారు..
మత్స్యకార సహకార ఎన్నికల నేపథ్యంలో..
రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఈనెల 29న మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఓటర్లను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యురాలు భర్తపై పోలీసులు చేయి చేసుకున్నారు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి సిఐతో వాదనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మాకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తాం అంటూ హెచ్చరించారు. ఎవరైతే తమ మనుషులపై చేయి చేసుకున్నారు విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు.
దూకుడు తగ్గించని నేతలు..
అయితే గతంలో కూడా పేర్ని నాని లాంటి నేతలు ఇలానే పోలీసులతో వాదనకు దిగారు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు నడిరోడ్డుపై పోలీస్ అధికారులకు పెద్ద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఆ వంతు జక్కంపూడి రాజాకు వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వల్లే ఇలా వైసిపి నేతలు రెచ్చిపోతున్నారని టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పోలీసులతో సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇటువంటి ఘటనలు జరగవు అని భావిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దూకుడు ఆ పార్టీకి మైనస్ చేస్తోంది. జక్కంపూడి రాజా ఒక సీఐపై దూసుకెళ్లిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూకుడు అనుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం దానిని తప్పుపడుతున్నారు.