Janasena Party : జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 స్థానాలకు పరిమితం అయిన ఆ పార్టీ భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. ఈ తరుణంలో ముఖ్యమైన నేతలంత బయటకు వెళ్ళిపోతున్నారు. చివరకు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకుంటున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే తాజాగా జనసేనలోకి భారీగా నేతలు వెళ్లడం విశేషం. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కూడా అదే బాటలో నడిచారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇద్దరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.
* ఎన్నికలకు ముందు పదవులు
కైకలూరు కి చెందిన జయ మంగళ వెంకటరమణ గతంలో టిడిపిలో ఉండేవారు. ఈ ఎన్నికల కు ముందు ఆయన వైసీపీలో చేరారు. దీంతో ఎమ్మెల్సీగా పదవి దక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంకటరమణ సైలెంట్ అయ్యారు. ఇటీవల పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన తిరిగి టిడిపిలో చేరతారని ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా జనసేనలోకి వచ్చారు. మంగళగిరి వైసీపీ టికెట్ ఆశించారు గంజి చిరంజీవి. కానీ జగన్ మొండి చేయి చూపారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన చిరంజీవి.. ఇప్పుడు జనసేన లో చేరారు.
* ప్రత్యేక వ్యూహంతోనే
అయితే టిడిపిలో చేరతారని భావించిన నేతలు అంతా.. జనసేనలోకి వస్తుండడం విశేషం. దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో అయితే జనసేన బలోపేతం కావాల్సి ఉందో.. అటువంటి వాటిపై దృష్టి పెట్టారు పవన్. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ కీలక నేతలను జనసేనలోకి రప్పిస్తున్నారు. తద్వారా పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి పెట్టినట్లు సమాచారం. త్వరలో పవన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరింత మంది జనసేనలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.