YS Jagan Security
YS Jagan Security: జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతకు భద్రత కల్పించడం పోలీస్ శాఖ విధి అని.. కానీ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎటువంటి భద్రత కల్పించడం లేదని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. జెడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న నాయకుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన తీరును ఎండగడుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అటు తరువాత గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత కుటుంబాన్ని సైతం పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి పోలీస్ శాఖ సరైన భద్రత కల్పించడం లేదన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం.
* కేంద్రానికి మిధున్ రెడ్డి లేఖ
తాజాగా వైయస్సార్సీపీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( Mithun Reddy )ప్రధాని మోదీ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఫిర్యాదు చేశారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్ కు పోలీసులు రక్షణ కల్పించలేదని.. ఆ సమయంలో తీవ్ర భద్రత వైఫల్యం తలెత్తిందని మిధున్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ క్యాటగిరి లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
* భద్రతపై వైయస్సార్సీపీలో అనుమానాలు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ కుట్ర జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఇటీవల జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు. లోకేష్ జన్మదిన నాడు కొంతమంది టీడీపీ శ్రేణులు జగన్ నివాసం ఎదుట హల్చల్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోని ప్రాంగణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా మిధున్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కుట్రలో భాగంగా జరుగుతున్న పరిణామాలుగా అనుమానం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ఇక్కడ భద్రత వైఫల్యాలు ఉన్నాయని ప్రస్తావించారు.
* కేంద్ర హోంశాఖ ఆరా
ఒకవైపు గవర్నర్ కు( governor) ఫిర్యాదు చేయడం, ఇంకోవైపు కేంద్రానికి లేఖ రాయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే రాష్ట్ర ప్రతిపక్ష నేతగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ తప్పకుండా కలుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వెళ్లిన క్రమంలో కేంద్రం సైతం ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది.