Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఎందుకో విచక్షణ కోల్పోతున్నారు. పవన్ అంటేనే పూనకాలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. పవన్ ను ఓడించి తీరుతానని హెచ్చరిస్తున్నారు. లేకుంటే తన పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు.పవన్ కు ప్రత్యర్థి వైసీపీ,జగన్ అన్న మాటను మరిచి.. తానే అసలు సిసలు ప్రత్యర్థిని అని ముద్రగడ పద్మనాభం భావిస్తుండడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వైసిపి కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలను తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రశ్నించలేదని పవన్ అడుగుతున్నారని.. వారిని అడిగే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో మీ పాత్ర లేదని.. సానుభూతి కూడా చూపించలేదని.. తనకు కనీసం ఉత్తరం రాయలేదని ఆక్షేపించారు. ఈ క్రమంలో ముద్రగడ ఆగ్రహానికి గురయ్యారు. తాను చవటను, దద్దమ్మను, ఆవేశం లేని వాడినిగా పవన్ భావిస్తున్నారని.. అయితే నాడు మీరెందుకు రోడ్డు ఎక్క లేదని ప్రశ్నించారు.
జగన్ నాడు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినప్పుడు.. అడగక పోవడానికి కారణం ఉందన్నారు. రిజర్వేషన్ ఇస్తామన్న వారిని మాత్రమే తాను అడిగానని.. జగన్ హామీ ఇవ్వనందున తాను అడగలేదని ముద్రగడ తేల్చి చెప్పారు. అయితే రిజర్వేషన్ ఉద్యమ సమయంలోతనకు మద్దతు తెలపకపోవడాన్ని మాత్రం ముద్రగడ ఆక్షేపిస్తున్నారు. అసలు మీది ఏ గ్రామమని? ఏ మండలం అని? హైదరాబాదు నుంచి వచ్చి పిఠాపురంలో ఎలా పోటీ చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు. హైదరాబాదులో మీరు పోటీ చేయొచ్చు కదా అని కూడా సలహా ఇచ్చారు. అంతటితో ఆగకుండా పవన్ ను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అదే జరగకపోతే తన పేరునుపద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ముఖానికి రంగు ఉందని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని హెచ్చరించారు. మొత్తానికైతే ముద్రగడ ఒక పద్ధతి ప్రకారం పవన్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం. పవన్ బహిరంగ సభల్లో మాట్లాడితే.. ముద్రగడ ప్రెస్ మీట్ లలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు.