MPDO Attacks: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ పై ఒక విమర్శ ఉంది. దాడులకు, వ్యక్తిగత విమర్శలకు వెనుకడుగు వెయ్యరని ఆ పార్టీ నేతలపై ఉన్న ప్రధాన ఆరోపణ. బూతులతో రెచ్చిపోతారన్న విమర్శ ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అదే మైనస్. అయితే దాని నుంచి ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇంకా అటువంటి వైఖరితోనే ముందుకెళ్తోందని తెలుస్తోంది. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లాలో ఏకంగా ఓ ఎంపీడీవో పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీపీ భర్త దాడి చేయడం సంచలనంగా మారింది. మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
* కూటమి రావడంతో సీన్ రివర్స్..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. 2019లో గెలిచిన ఆ పార్టీ తరువాత వచ్చిన అన్ని రకాల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. పంచాయితీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను ఏకపక్షంగా సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు వారికి తిరిగే లేదు. 2019 జూన్ వరకు ఈ పరిస్థితి కొనసాగింది. కానీ కూటమి అధికారంలోకి రావడంతో వారి పరిస్థితి రివర్స్ అయ్యింది. ఇటువంటి క్రమంలో స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు కూటమి ప్రయత్నం మొదలుపెట్టింది. మూడు నెలలు ముందుగానే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయింది.
* బిల్లుల విషయంలో వివాదం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనకు సంబంధించి భారీగా నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పుడు కూడా మంజూరు అవుతున్నాయి. కూటమి నేతలు పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన పనులు కు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పదవీకాలం చూస్తుంటే ముగుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అదే మాదిరిగా సత్య సాయి జిల్లా రోల్ల మండలం ఎంపీపీ భర్త విజయ రంగే గౌడ్ బిల్లుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కానీ బిల్లుల చెల్లింపు లేకపోవడంతో ఏకంగా ఎంపీడీవో నాగేశ్వర శాస్త్రి పై దాడి చేశారు. కార్యాలయ ప్రాంగణంలోనే ఒక్కసారిగా దాడి చేయడంతో సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో గాయపడిన నాగేశ్వరరావు శాస్త్రిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.