YSR Congress : ఎన్నికల్లో ఓటమి నుంచి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ తేరుకుందని అంతా భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అనతి కాలంలోనే నిలబడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే అది తెలియాలంటే కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ నిలబడగలగాలి. అటువంటి అరుదైన చాన్స్ 2026లో ఆ పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా వస్తున్న నేపథ్యంలో.. ధైర్యం కూడదీసుకుని ఆ పార్టీ పోటీ చేస్తే మాత్రం ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో అనే విషయం తేలుతుంది. అయితే అందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? లేదా? అన్నది చూడాలి. ఎందుకంటే 2024 ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి ఫలితాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న పరిస్థితి కూడా లేదు. దీంతో స్థానిక సంస్థలు ఎన్నికలకు లోకల్ నేతలు ముందుకు వస్తారా? అంత సాహసం చేస్తారా? అన్నది ఒక అనుమానమే.
* భయం ఆపై ప్రలోభం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2021 లో స్థానిక సంస్థలు( local bodies) ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పరిస్థితులు అందరికీ తెలిసినవే. సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటరీ వ్యవస్థ బాగానే పనిచేసింది అప్పట్లో. ప్రలోభాలతో పాటు భయపెట్టి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ అప్పట్లో స్పష్టమైన మార్కు చూపించింది. ఇప్పుడు అదే మార్కు కూటమి ప్రభుత్వం కూడా చూపిస్తుంది. ఆపై ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షానికి చాన్స్ ఉండదు కూడా. పైగా మూడు పార్టీలు అక్కడ సమన్వయంతో కచ్చితంగా వ్యవహరిస్తాయి. అందుకే వైసిపి నిలబడుతుందా? అన్నది డౌటే.
* సంక్షేమ పథకాల హవా..
గతంలో స్థానిక సంస్థలంటే నాయకత్వ సమర్థతపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయి. పథకాల కోత భయం ఓటర్లను వెంటాడుతుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో భయపెట్టి స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూటమిసైతం తప్పకుండా అలానే చేస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి. అధికార పార్టీకి ఎదురు వెళ్లేందుకు ప్రజలు కూడా ఇష్టపడరు. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎన్నికలు ఒక విషమ పరీక్ష గానే ఉంటాయి. అయితే గతంలో పార్టీలు అనుసరించిన బహిష్కరణ వ్యూహం తప్పకుండా అమలు చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనే నినాదం పైకి వచ్చింది. తద్వారా అప్పుడే బహిష్కరణకు వైసిపి మొగ్గు చూపినట్లు అయింది.