Boragadda Anil Kumar : మీడియా ముందు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయే వారికి.. రాజకీయ విమర్శలు చేసే వారికి.. పురుష పదజాలం ప్రయోగించే వారికి బోరుగడ్డ అనిల్ కుమార్ ( boragadda Anil Kumar ) వ్యవహారం ఒక గుణపాఠమే. ఇన్నాళ్లు బోరుగడ్డ అనిల్ కుమార్ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న ప్రచారం నడిచింది. కానీ అసలు ఆయన తమ పార్టీ మనిషి కాదని ఇప్పుడు వైసీపీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అటువంటి వారికి తమ పార్టీలో స్థానం లేదన్నట్టు మాట్లాడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇదే అనిల్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు.. రాజకీయ ప్రత్యర్థులను దూషించినప్పుడు ఒక్కసారిగా కూడా ఖండించలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి తెలిసి వచ్చింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిందని గుర్తించింది. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం నిజం. బోరుగడ్డ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చిన మాటతో చాలామంది బాధితులుగా మిగిలారు. కానీ ఆ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బాధితుడిగా మారిపోయారు. అప్పట్లో ప్రోత్సహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి నిజంగా గుణపాఠమే.
* జుగుప్సాకరంగా కామెంట్స్
బోరుగడ్డ అనిల్ కుమార్ వరుసగా సోషల్ మీడియాలో( social media) చేసిన ఇంటర్వ్యూలు సగటు పౌరుడికి సైతం ఆగ్రహం తెప్పించేవి. రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఆ జుగుప్సాకర మాటలకు చాలా ఆవేదన చెందే వారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వారిని రకరకాలుగా సంబోధిస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే విధానం.. నా కొడకల్లారా అంటూ నిత్యం చేసే వ్యాఖ్య మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే అంత స్వేచ్ఛగా మాట్లాడిన అనిల్ కుమార్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా చర్యలు తీసుకునేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన వ్యాఖ్యల మూలంగా జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు పార్టీకి సంబంధం లేదన్నట్టు ప్రకటించడం ఏంటనేది చర్చ.
* అప్పుడు ఎంటర్టైన్ చేసి..
గతంలో ఏ మీడియా ఇంటర్వ్యూలో అయినా తాను జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )మనిషి అని చెప్పుకునే వారు బోరుగడ్డ అనిల్ కుమార్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగానే పరిచయం చేసుకునేవారు. అంతెందుకు తాజాగా అరెస్టుల పర్వం నడిచిన సమయంలో, కోర్టుల వద్ద కూడా తన వెంట వైసీపీ ఉందని, జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసేవారు. ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రతిపక్ష నేతను ఉద్దేశించి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి, వారి పిల్లలను ఉద్దేశించి నిస్సిగ్గుగా మాట్లాడారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయన వాడిన భాష, దాని ప్రయోగం అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంపుగా కనిపించింది. కానీ ఇప్పుడు అదే బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నేత అని సంబోధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ అయ్యారు బోరుగడ్డ. కేసుల మీద కేసులతో పాటు రిమాండ్లు కొనసాగాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వైసీపీ నేతగానే ఆయన పరిచయం చేసుకోవడం ఎంత మాత్రం ఆ పార్టీకి ఇష్టపడడం లేదు. ప్రత్యర్ధులను నోటికి వచ్చినట్లు తిట్టినప్పుడు దండించాల్సిన అధికారపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినోదంగా చూసింది. ఇప్పుడు అదే వ్యక్తి తమ వాడు అని చెప్పుకునేందుకు సైతం ఇష్టపడడం లేదు. ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి గుణపాఠమే. పార్టీల మాటున ఏది పడితే అది మాట్లాడుతాం అనుకుంటే బాధిత వర్గంగా మిగలడం ఖాయం.