Hindupuram: హిందూపురంలో( hindupuram ) లోకల్ నినాదం తేవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి గెలుపొందుతూ వస్తోంది. ఇక్కడ టిడిపిని మట్టి కరిపించాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఈ నియోజకవర్గంలో టిడిపికి బలమైన పునాది ఉంది. దీని వెనుక నందమూరి కుటుంబం కృషి ఉంది. ఈ నియోజకవర్గ నుంచి నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించారు. అటు తరువాత హరికృష్ణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా విపక్షాలకు హిందూపురం నియోజకవర్గం చిక్కలేదు. 2024 ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు వైసీపీ లోకల్ నినాదం తేవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
చిత్ర పరిశ్రమలో( cine industry) కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు బాలకృష్ణ. హిందూపురం శాసనసభ్యుడిగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన సినిమాలను కూడా కొనసాగిస్తున్నారు. అయితే నియోజకవర్గ విషయంలో మాత్రం ప్రత్యేక దృష్టితో ఉంటారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి తప్పకుండా పర్యటనలు చేస్తారు. మరోవైపు ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధర సైతం ఎక్కువగా నియోజకవర్గానికి వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అటువంటి నియోజకవర్గంలో బాలకృష్ణ హవా చూస్తున్న ప్రత్యర్ధులు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ పై హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ వేణు రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వేణు రెడ్డి కార్యాలయం పై టిడిపి శ్రేణులు దాడి చేసే దాకా పరిస్థితి వచ్చింది.
* పోటీ ఇవ్వలేకపోయిన మహిళా నేత
గత ఎన్నికల్లో దీపిక రెడ్డి( Deepika Reddy) అనే మహిళ నేతను రంగంలోకి దించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చాలా సమీకరణలను వడబోసి దీపిక రెడ్డి సరిపోతారని భావించి ఆమెను పోటీలో పెట్టారు. అయితే ఆమె కనీసం బాలకృష్ణ కు పోటీ ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉన్న వేణు రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. హైదరాబాదు నుంచి ఎవడో ఏలుతున్నాడని.. ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకులు అంటూ చేసిన వ్యాఖ్యలు టిడిపి శ్రేణులను ఆగ్రహం తెప్పించాయి. దీంతో వేణు రెడ్డి కార్యాలయం పై దాడి జరిగింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం ఇంగ్లీషులో ట్వీట్ చేశారు. టిడిపిని రెచ్చగొట్టి.. శాంతిభద్రతల విఘాతంతో పాటు తప్పుడు ప్రచారం చేసేందుకు దీనిని ఒక ప్రయత్నం గా మలుచుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు.
* ఓడించేందుకు సర్వ ప్రయత్నాలు..
2024 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ఓడించేందుకు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం బాలకృష్ణ గెలిచేసరికి వైసిపి కి మైండ్ బ్లాక్ అయింది. అందుకే 2024 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గెలవకూడదని జగన్ భావించారు. ఆ బాధ్యతను సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన తన సొంత నియోజకవర్గ పుంగనూరును కాదని హిందూపురంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయినా సరే ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ పై తప్పుడు ప్రచారాలకు వైసీపీ దిగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదంతా రెచ్చగొట్టడంలో భాగమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.