YSRCP MLC Resignations: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కొంతమంది అయితే వైసిపి ద్వారా వచ్చిన పదవులను సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆ పదవులకు రాజీనామా చేశారు. కూటమి పార్టీలో చేరిపోయారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు కానీ.. పదవులకు రాజీనామా ఆమోదించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని వారు విమర్శిస్తున్నారు. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలకు డిమాండ్ చేస్తారు. అనర్హత వేటు వేయాలని కోరుతారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా రాజీనామా చేసినా ఆమోదించక.. బలవంతంగా ఆ పదవుల్లో ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
* ఐదుగురు రాజీనామా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్లో తమ రాజీనామాలను సమర్పించారు. కానీ మండలి చైర్మన్ ఆమోదించకపోవడం వెనుక పెద్ద రాజకీయ కోణం ఉంది. సాంకేతికంగా వారు వైసిపి ఎమ్మెల్సీలు గానే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీని వెనుక భారీ మాయాజాలం ఉంది. రాజీనామా చేసిన మరుక్షణం తమ బలం తగ్గిపోతుంది శాసనమండలిలో. ఆపై కూటమి బలం పెరిగిపోతుంది. చివరికి న్యాయస్థానాలు ఆదేశించినా శాసనమండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే ఎమ్మెల్సీలతో రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక కూడా జరిగిపోయింది.
* మండలిలో బలం తగ్గుతుందని..
మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆ బలంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం గురించి తెలియంది కాదు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు సభకు వెళ్లడం లేదు. ఉన్న ఎమ్మెల్సీలపై ఆధారపడి శాసనమండలిలో రాజకీయం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ బలం తగ్గిపోతుందని తెలిసి ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం పొందడం లేదు. చివరకు న్యాయస్థానాలు ఆదేశిస్తున్న వారు వినడం లేదు. అయితే దీనిపై కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.