Y S Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నాయకత్వానికి సీనియర్ల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా సమయం చూసి వారు జగన్మోహన్ రెడ్డిని గట్టిగానే షాక్ ఇస్తున్నారు. గొంతెమ్మ కోరికలతో ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో సీనియర్లంతా సైలెంట్ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వైఖరి ఇప్పుడు అలానే ఉంది. ఆయన వైసీపీలో యాక్టివ్ అయినట్టే అయి.. మళ్లీ వెనక్కి తగ్గిపోతున్నారు. దానికి కారణం జిల్లా తన కంట్రోల్లో పెట్టాలన్న ప్రధాన డిమాండ్. దీనికి జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ఇది జాతీయ పార్టీ కాదని.. ప్రాంతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తించుకోవాలని ధర్మానకు అధినేత సూచిస్తున్నారట. అవన్నీ అనవసరం జిల్లాను తన చేతిలో పెడితేనే అన్నట్టు ధర్మాన వైఖరి ఉందట. కానీ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సైతం ఏ నిర్ణయము తీసుకోలేకపోతున్నారట. ఆది నుంచి ధర్మానతో ఏంటి తలనొప్పి అంటూ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వద్ద బాధపడుతున్నారట. ధర్మానకు ప్రత్యామ్నాయంగా సరైన హ్యాండ్ దొరికితే వదులుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారట. కానీ ఆ జిల్లాలో ధర్మాన సోదరులకు ఉన్న పట్టు దృష్ట్యా.. జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గుతున్నారట.
* కాంగ్రెస్ లో ముద్ర..
ధర్మాన కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన కొద్ది కాలానికే శాసనసభ్యుడితోపాటు మంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక ధర్మాన ప్రసాదరావుకు( dharmana Prasad Rao ) ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అలా 2004 నుంచి 2014 వరకు శ్రీకాకుళం జిల్లాను శాసించగలిగారు ధర్మాన. పైగా ఉమ్మడి రాష్ట్రంలోనే కీలకమైన రెవెన్యూ శాఖను ధర్మాన ప్రసాదరావుకు కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి. చాలా కీలకమైన శాఖ కావడం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉండడంతో ధర్మాన ఏది చెబితే అది జరిగేది. అయితే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరవలసి వచ్చింది ధర్మానకు. అయితే కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నారు ధర్మాన.
* పరస్పర విరుద్ధ అభిప్రాయాలు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో ధర్మానకు మంచి అభిప్రాయం లేదు. ధర్మాన విషయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే అభిప్రాయం. కానీ పరస్పర ప్రయోజనాల కోసమే ఆ ఇద్దరు నేతలు కలిసి పని చేశారు తప్ప.. మరొకటి కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సైతం శ్రీకాకుళం జిల్లాలో ఆప్షన్ లేదు. ధర్మాన ప్రసాదరావు వద్దనుకుంటే అన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు దానినే అలుసుగా తీసుకొని జిల్లాను తన చేతుల్లో పెట్టాలని కోరుతున్నారట ధర్మాన. తన సొంత అజెండాతో ముందుకు వెళ్లి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించి ఇస్తాను అంటూ ధర్మాన చెబుతున్నారట. కానీ తన వ్యక్తిగత చరిష్మతో పార్టీ గెలుస్తుంది కానీ.. ఇటువంటి నేతలకు ఛాన్స్ ఇవ్వకూడదు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.
* ప్రత్యామ్నాయం వెతుకులాట..
రోజురోజుకు ధర్మాన ఒత్తిడి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ధర్మాన కృష్ణ దాస్ జగన్ వెంట ఉంటారు. సీనియర్ నేత తమ్మినేని సీతారాం, మాజీమంత్రి సిదిరి అప్పలరాజు వంటి నేతలను ప్రస్తుతం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేసి.. ఈ నలుగురు నేతలతో ముందుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. మరి ధర్మాన ప్రసాదరావు లేకుండా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తన కంట్రోల్లో తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి.