YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy) హత్య కేసు ఇప్పట్లో తేలేలా లేదు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. వివేకానంద రెడ్డి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాయ్. ఆపై ఎంపీ తోపాటు మంత్రి పదవి చేపట్టిన నేత. అటువంటి నాయకుడు చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. కానీ దర్యాప్తు జరగడం, దానిపై సందేహాలు వ్యక్తం కావడం, కోర్టులు కలుగజేసుకోవడం, అనేకరకాలైన షరతులు తెరపైకి రావడం వంటి వాటితో ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. పైగా ఈ కేసు విచారణలో ఏం జరుగుతోంది అనేది సామాన్య వ్యక్తులకు సైతం లేదు. అయితే ఏ వ్యవస్థ లోపం అన్నది తెలియడం లేదు కానీ.. సాధారణ హత్య కేసులను రోజుల వ్యవధిలో ఛేదించే పోలీసులు.. ఒక ముఖ్య నేత చనిపోతే ఏడేళ్ల పాటు నిందితులను పట్టుకోలేకపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
* రాజకీయ కోణంలోనే హత్య..
అయితే వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తులు తప్పును ఒప్పుకున్నారు. తామే చంపేసినట్లు చెప్పుకొచ్చారు. ఆస్తుల వివాదానికి సంబంధించిన కారణాలు చెప్పారు. కానీ అంతకుమించి రాజకీయ కోణం ఉందన్నది వివేకా కుమార్తె సునీత రెడ్డి అనుమానం. రాజకీయ లబ్ధి కోణంలో దర్యాప్తు చేపడితే అసలు సూత్రధారులు బయటపడతారు అన్నది ఆమె అభిప్రాయం. ఆ పాయింట్ చుట్టూ విచారణ జరగకుండా సిబిఐ దర్యాప్తు ముగిసిందని ఆమె భావించింది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ విషయాన్ని సిబిఐ కోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో సిబిఐ ఈ పిటిషన్ విచారణకు అంగీకరించింది. నెల రోజుల్లో దర్యాప్తు ముగించాలని ఆదేశించింది సిబిఐకి. అయితే సునీత రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు.. వివేకానంద రెడ్డి పీఏ కంటే జగన్మోహన్ రెడ్డికి గంట ముందు ఫోన్ ఎవరు చేశారు? వివేకానంద రెడ్డి చనిపోయినట్టు ఎవరు చెప్పారు? దాని వెనుక జరిగింది ఏమిటి? అనే పాయింట్ పై విచారణ కోరుతున్నారు సునీత. కానీ సిబిఐ కోర్టు మాత్రం ఆ టైమింగ్ తో పని ఏముంది అన్నట్టు చెప్పి.. ఈ కేసులో మిగతా నిందితులను విచారణ జరపాలని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని సునీత రెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* హైకోర్టుకు సునీత?
కేవలం రాజకీయ కోణంలోనే తన తండ్రి హత్య జరిగిందన్నది సునీత రెడ్డి అనుమానం. తన తండ్రి మరణాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి కంటే.. ముందే జగన్ మోహన్ రెడ్డికి తెలిసిందని.. ఆ ఫోన్ జగన్ భార్య భారతి రెడ్డికి వెళ్లిందని.. ఎన్నికల మేనిఫెస్టో తయారీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆమె చెప్పారని.. పక్కనే సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ఉన్నారని సిబిఐ విచారణలో తేలింది. అజయ్ కల్లం దీనిపై స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే స్టేట్మెంట్ కోర్టుకు కూడా చేరినట్లు ప్రచారం నడిచింది. కానీ ఆ స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకున్నట్లు అజయ్ కల్లాం చెబుతున్నారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫోన్ టైమింగ్ పై విచారణ చేపట్టాలని సునీత రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ కోర్టు దీనిని పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి అయితే వివేకా హత్య కేసు విచారణ ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదని మాత్రం స్పష్టం అవుతుంది.