YS Vivekananda Case: ఏదైనా కేసు విచారణ పూర్తయితే తీర్పు వస్తుంది కోర్టు నుంచి. కానీ విచారణ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై స్పందించింది న్యాయస్థానం. మరోసారి విచారణకు ఆదేశించింది. దేశ చరిత్రలోనే అటువంటి అరుదైన కేసు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు సిబిఐ విచారణ చేపట్టింది. తాము చేపట్టిన విచారణ నివేదికను కోర్టుకు అందించింది. అయితే విచారణ సవ్యంగా సాగలేదని.. కేసులో సూత్రధారులను విచారించలేదని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై సిబిఐ కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఆ మేరకు వివేక కుమార్తె పిటిషన్ దాఖలు చేస్తే.. మరో నెల రోజులపాటు విచారణకు గడువు విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. దేశ చరిత్రలోనే ఇదో సంచలన తీర్పు కూడా.
* సూత్రధారులు ఎవరన్న దానిపైనే..
కేవలం రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగింది అన్నది వివేకానంద కుమార్తె సునీత వాదన. కడప జిల్లాలో( Kadapa district ) రాజకీయ ఆధిపత్యం లో భాగంగా సొంత కుటుంబ సభ్యులే ఈ హత్య చేయించారని ఆమె ఆరోపిస్తున్నారు. వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అన్నది ఆమె ఆరోపణ. తెర వెనుక సూత్రధారులు సైతం ఉన్నారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని ఒక్కసారి కూడా అరెస్టు చేయకపోవడం ఏమిటనేది ఆమె వాదన. రాజకీయ కుట్రపూరిత కోణంలోనే ఈ హత్య జరిగిందని ఆమె బలంగా నమ్ముతున్నారు. అందుకే న్యాయ పోరాటం చేస్తున్నారు. ఒక కేసు విచారణ ముగిసి.. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత కోర్టు స్పందించడం అనేది వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యేకంగా కనిపిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో కోర్టు కూడా తుది విచారణకు ఒక నెల రోజుల గడువు విధించింది. దీంతో ఈ కేసు విచారణ ఎలా ముందుకు వెళుతుంది అనేది హాట్ టాపిక్ అవుతోంది.
* సునీత న్యాయపోరాటం..
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత( Sunita) ఎక్కువగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వెనుక కుటుంబ పెద్దలు ఉన్నారన్నది ఆమె అనుమానం. వివేకానంద రెడ్డి ఉంటే తమ రాజకీయ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సునీత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కోర్టులకు కూడా ఇదే విషయాన్ని నివేదిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. సునీతతో పాటు షర్మిలలు ఈ హత్య కేసు విచారణలో జగన్ సర్కారు వైఖరిని తప్పుపడుతున్నారు. నిందితులను కాపాడుతున్నారని నేరుగా జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. అయితే ఇందులో సునీత మాత్రం కేవలం పాత్రధారులే కాదు.. సూత్రధారులను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం సుప్రీంకోర్టును సైతం కదిలించింది. ఒక కేసు విచారణ పూర్తయిన తర్వాత.. మళ్లీ రీఓపెన్ చేసి విచారణను మొదలు పెట్టడం వెనుక ఆమె న్యాయమైన పోరాటం ఉంది. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం కూడా. అయితే కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ మొదలైన మరుక్షణం నుంచి సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో సంచలనాలు నమోదయ్య చాన్స్ మాత్రం కనిపిస్తోంది.