YS Vijayamma: జగన్, షర్మిల.. తన మద్దతు ఎవరికో వీడియోలో చెప్పిన వైఎస్ విజయమ్మ

మొన్న ఆ మధ్యన రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : May 11, 2024 6:05 pm

YS Vijayamma

Follow us on

YS Vijayamma: వైయస్ విజయమ్మ తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఒకవైపు చూస్తే కుమారుడు, మరోవైపు చూస్తే కుమార్తె.. ఎవరికి అండగా ఉండాలో తెలియక విదేశాలకు వెళ్లిపోయారు. అయితే పోలింగ్ కు ముందు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయక తప్పలేదు. ఏపీ ప్రజల కంటే ముందుగానే తీర్పు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఆమెది. చివరకు ఆమె కుమార్తె వైపే మొగ్గు చూపారు. కుమారుడు జగన్కు షాక్ ఇచ్చారు. కడప జిల్లా ఓటర్లకు ఎటు ఓటు వేయాలో చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోను సైతం కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం విశేషం. దీంతో విజయమ్మ కాంగ్రెస్ వైపు నిలబడ్డారన్నది బహిరంగ రహస్యం. కుమార్తెకు ఓటు వేయాలని చెప్పడం ద్వారా.. కుమారుడు పార్టీకి ఆదరించవద్దని స్పష్టం అయ్యింది.

మొన్న ఆ మధ్యన రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో విజయమ్మ అక్కడకు హాజరయ్యారు. కుమారుడు జగన్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. అక్కడకు కొద్ది రోజులకే షర్మిల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సైతం షర్మిలను ఆశీర్వదించారు విజయమ్మ. తనకు ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు లాంటి వారిని సంకేతాలు ఇచ్చారు. ఇక్కడ ఉంటే ఎవరికో ఒకరికి మద్దతు తెలపాల్సి ఉంటుందని భావించారు. ముందు జాగ్రత్త చర్యగా విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేయడం విశేషం.

కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా వైయస్ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. వివేక భార్య సౌభాగ్యమ్మతో పాటు కుమార్తె సునీత విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో విజయమ్మ తీవ్ర తర్జనభర్జన పడ్డారు. అలా చేస్తే కుమారుడికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించి
.. మనసు అంగీకరించక విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు తన మనసు అంగీకరించకో.. లేకుంటే ఒత్తిడితోనో ప్రత్యేక వీడియో విడుదల చేయడం విశేషం.

అయితే విజయమ్మ ఆ వీడియోలో భావోద్వేగ ప్రకటన చేశారు.’ వైయస్సార్ ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కడప నా విన్నపం అంటూ వీడియోను విజయమ్మ ప్రారంభించారు. వైయస్సార్ బిడ్డ షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని.. వైయస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్కు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నట్లు కడప ఓటర్లను ఆమె కోరారు. తద్వారా తన మద్దతు కూతురు షర్మిల కే అని విజయమ్మ తేల్చి చెప్పారు. పోలింగ్కు 24 గంటల ముందు విజయమ్మ నోటి నుంచి షర్మిల మాట రావడంతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. విజయమ్మ మాటలను వైయస్ అభిమానులు సీరియస్గా తీసుకుంటే మాత్రం ప్రమాద ఘంటికలు తప్పవు.