YS Sunitha: కడపలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల యాక్టివ్ అవుతున్నారు. ఆమె ఇప్పటికే కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ ఎంతగా తన మార్కు చూపెడితే.. అంతలా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆమె నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు వివేక కుమార్తె సునీత సైతం షర్మిల వెంట నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్య కేసు విషయమై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ విషయంలో ఆమెకు షర్మిల అండగా నిలబడుతూ వస్తున్నారు. కేసులో గత ఐదేళ్లుగా పురోగతి లేకపోవడంతో సునీత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. తన తండ్రిని ఎలా హత్య చేసింది? ఇందులో పాత్రధారులు, సూత్రధారుల గురించి ఆమె ప్రచారం చేయనున్నారు. అదే జరిగితే వైసీపీ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలినట్టే. అంతకుమించి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కడప జిల్లాలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు చెల్లెళ్లు తోడైతే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పదు.
కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్ కుటుంబం.గత నాలుగు దశాబ్దాలుగా కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చింది. కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల నియోజకవర్గంలో ఆ కుటుంబమే ఆధిపత్యం వహిస్తూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి తరువాత ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి ఎంపీ తో పాటు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీన్ మారింది. ఆ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ప్రారంభమయ్యాయి. మళ్లీ జగన్ పార్టీ స్థాపించిన తర్వాత ఆ కుటుంబమంతా ఒక్కటైంది. కానీ వివేకానంద రెడ్డి హత్యతో అడ్డగోలుగా చీలిపోయింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి ఎక్కువగా కనిపించింది.
సోదరుడితో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ కలిసి రాకపోయేసరికి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అందుకున్నారు. జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమెకు సునీత తోడయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కడప జిల్లాలో పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే సుదీర్ఘకాలం తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గం నుంచి సునీత పోటీ చేసే అవకాశం ఉంది. అటు సునీత తల్లిని పులివెందులలో పోటీ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది ముమ్మాటికీ జగన్కు ఇబ్బందికర పరిణామమే. గతంలో ఉన్న మెజారిటీ తగ్గినా.. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాకపోయినా సొంత కుటుంబం నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబంలో ఇంతలా అగాధం ఏర్పడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్రత్యర్థులకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అందుకే వైఎస్ కుటుంబంలో ఎవరికి అండగా నిలవాలో తెలియక సతమతమవుతున్నారు.