YS Sharmila : ఇలా అనేసింది ఏంటి.. పవన్ కళ్యాణ్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చకు కారణమవుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ తో పాటు డీఎంకే పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలకు పవన్ టార్గెట్ అవుతున్నారు. ఈ క్రమంలో వైయస్ షర్మిల టార్గెట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Written By: Dharma, Updated On : October 4, 2024 5:32 pm

YS Sharmila

Follow us on

YS Sharmila :  ఏపీలో లడ్డు వివాదం నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.ఇప్పటివరకు వైసీపీ ఈ విషయంలో కార్నర్ అయింది. తెలుగుదేశం కూటమి తొలుతా ఆరోపణలు చేసింది. దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది వైసిపి. ఈ క్రమంలో కూటమి వెర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది. అయితే నిన్న తిరుపతిలో సనాతన ధర్మ డిక్లరేషన్ ను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది జాతీయ స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు పవన్. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును కూడా ఆక్షేపించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి వైఖరిని కూడా తప్పుపట్టారు. దీంతో ఈ లడ్డు వివాదం యూటర్న్ తీసుకుంది. కొత్త వివాదాలకు కారణమవుతోంది. అయితే రాహుల్ గాంధీని పవన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తప్పు పట్టారు. అధికారం వచ్చాక పవన్ వేషం, భాష మారిపోయాయి అన్నారు. ఉన్నత హోదాలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఒక్క మతమే ముఖ్యం అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. డిప్యూటీ సీఎం గా ఒక్క మతానికి చెందిన బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తుంటే.. మిగతా మతాలకు అభద్రతాభావం కలగదా అని ప్రశ్నించారు. జనసేన సెక్యులర్ పార్టీ అనుకునే వారమని.. కానీ ఇప్పుడు రైటిస్ట్ పార్టీ అని అర్థమవుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.మణిపూర్ లో బిజెపి క్రైస్తవుల ఊతకోత చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.మిగతా మతాలు అక్కర్లేదు అని వ్యవహరించడం దారుణం అన్నారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* రాహుల్ పై విమర్శలా
రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు షర్మిల. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల్లో సోదర భావం పెంపొందించేందుకుభారత్ జూడో యాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు.అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి పవన్ తన స్థాయి దిగజార్చుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల.అదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు షర్మిల తెలిపారు.స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరింది తొలుత కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాదిరిగా దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని కూడా షర్మిల తేల్చి చెప్పారు.

* ఇప్పటివరకు గౌరవం గానే
అయితే ఇప్పటివరకు జనసేన విషయంలో,పవన్ కళ్యాణ్ విషయంలో గౌరవంగానే మెలిగారు షర్మిల.కానీ ఇప్పుడు పవన్ జాతీయ అంశాలు ప్రస్తావించేసరికి.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేసరికి షర్మిల స్పందించాల్సిన అవసరం వచ్చింది. పవన్ తీరును తప్పుపట్టాల్సి వచ్చింది. అయితే పవన్ కామెంట్స్ తర్వాత.. ఆయనపై వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. కానీ అంతకుమించి షర్మిల ఇప్పుడు గట్టిగానే విమర్శలు గుప్పించారు. దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.