YS Sharmila Vs Avinash: వైఎస్ షర్మిల vs వైఎస్ అవినాష్.. ఈ అన్నా చెల్లెల్ల పోరులో గెలుపెవరిది?

కడపలో వివేకానంద రెడ్డి హత్య అంశము తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వివేక హత్య ఎంత సానుభూతి తెప్పించిందో.. గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు వైసీపీకి అంతగా ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : April 3, 2024 11:43 am

YS Sharmila Vs Avinash

Follow us on

YS Sharmila Vs Avinash: కడపలో అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. ఏ కుటుంబానికైతే కడప జిల్లా ప్రజలు అండగా నిలబడ్డారో.. అదే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు బరిలో నిలవనున్నారు. దీంతో ప్రజలు ఎవరి పక్షాన నిల్చుంటారో తెలియని పరిస్థితి. కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్ కుటుంబం. నాలుగున్నర దశాబ్దాలుగా కడప జిల్లాలో వైయస్సార్ కుటుంబానిది చెరగని ముద్ర. కానీ తొలిసారిగా అదే కుటుంబంలోని వ్యక్తుల మధ్య ముఖాముఖి పోరు నడవనుంది. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలా ప్రకటన చేసే క్రమంలో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఈ నిర్ణయం వెనుక తాను పడిన బాధను వివరించే ప్రయత్నం చేశారు.

అయితే కేవలం షర్మిల వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని లేవనెత్తుతూ.. తన పోటీకి ప్రధాన కారణం బాబాయి హత్యేనని ప్రకటించడం విశేషం. తనను ఎంపీ చేయాలని వివేకానంద రెడ్డి పరితపించారని.. అప్పట్లో తాను ఆ విషయాన్ని పట్టించుకోలేదని.. ఆయన హత్య జరిగిన తరువాత తనకు అర్థమైందని షర్మిల చెప్పుకొచ్చారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారని ఆలస్యంగా తెలుసుకున్నానని.. వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికే మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.

కడపలో వివేకానంద రెడ్డి హత్య అంశము తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వివేక హత్య ఎంత సానుభూతి తెప్పించిందో.. గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు వైసీపీకి అంతగా ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని అజెండాగా తీసుకొని ఎన్నికల పోటీలో దిగారు. కడపలో రాజకీయాలకు అతీతంగా వైయస్ కుటుంబ అభిమానులు అధికంగా ఉంటారు. అయితే ఎంపీ పదవి కోసమే వివేకను దారుణంగా హత్య చేశారన్న ఆరోపణను ఇంతకాలం నమ్మలేదు. కానీ అదే కుటుంబంలో బాధితులు, జగన్ స్వయానా సోదరి షర్మిల కుండ బద్దలు కొట్టి చెబుతుండడం, అటు సిబిఐ సైతం నిందితులను ప్రకటించడం వంటి అంశాలు ఎన్నికల్లో బలంగా పనిచేయనున్నాయి. అందుకే షర్మిల తన సోదరుడు జగన్ అంటే తనకు ద్వేషం లేదని.. బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్నారని.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని తాజాగా ఆరోపణలు చేశారు.

వాస్తవానికి షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తారని వైసీపీ శ్రేణులు నమ్మలేదు.మొన్నటికి మొన్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి విజయమ్మ హాజరయ్యారు. కుమారుడు జగన్ ను ఆశీర్వదించారు. దీంతో కడపలో పోటీ చేయడానికి షర్మిల సాహసించరని అంతా భావించారు. అయితే ఆది నుంచి అవినాష్ రెడ్డి విషయంలో కఠినంగా ఉన్న షర్మిల.. పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. తాను పోటీ చేస్తున్నానని చెబుతూనే.. తన టార్గెట్ కూడా చెప్పుకొచ్చారు. ఇదే అదునుగా బీజేపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన అన్న కుమారుడికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఇచ్చి.. తాను ఎంపీగా వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు షర్మిల బలమైన ప్రకటనలు చూస్తుంటే.. వైయస్ కుటుంబంలోనే కాదు కడప ప్రజల్లో చీలిక రావడం ఖాయం. అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవు. అయితే మున్ముందు షర్మిల నుంచి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని గమనించిన జగన్.. దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. అదే కుటుంబ సభ్యులతో షర్మిలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా జగన్ కు షర్మిల రూపంలో తలనొప్పి ప్రారంభమైనట్టే.