YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఆమె తరువాత స్టెప్ ఏమిటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ కు ఆమె జీవం పోస్తారా? లేకుంటే తన సోదరుడు జగన్ ను అధికారం నుంచి దూరం చేస్తారా? అయితే ఈ రెండు అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. వైసీపీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేతలే. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా వైసీపీలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో బలపడాలి అంటే.. వైసిపి బలహీనం కావాలి. అందుకే ఇప్పుడు షర్మిల వైసీపీని బలహీనం చేస్తే కానీ.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేలేరు. అందుకే షర్మిల అడుగులు బట్టి ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోకి వెళ్లారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్న జగన్ చేరికలను ప్రోత్సహించి కాంగ్రెస్ నాయకత్వానికి దెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో 2014, 2019 ఎన్నికల్లో నోటా కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. దాదాపు జీవం కోల్పోయిన ఆ పార్టీకి ఇప్పుడు షర్మిల ఆశాదీపం లా మారారు. కాంగ్రెస్ పునరుజ్జీవానికి తోడ్పాటు అందిస్తారని ఆ పార్టీ నాయకత్వం నమ్మకం పెట్టుకుంది.
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది. విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేదు. అధికారపక్షంగా వైసిపి ఉంది. టిడిపి, జనసేన కూటమి విపక్షంగా కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎదగాలన్న ఆకాంక్ష బిజెపిలో ఉంది. ఇటువంటి తరుణంలో షర్మిల వైసిపి తో కాకుండా మిగతా పార్టీల విషయంలో ఎలా ముందుకెళ్తారన్నది ఇప్పుడు ప్రశ్న. కేవలం సోదరుడు జగన్ ను దూషించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలపడదు. బలమైన అధికార పక్షం, అదే స్థాయిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఉండగా.. మూడో స్థాయిలో కాంగ్రెస్ పార్టీని షర్మిల నిలబెట్టాల్సి ఉంది. అయితే అందుకు తగ్గ వ్యూహం ఆమె వద్ద ఉందా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. గత ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ బై బై బాబు అని పిలుపునిచ్చారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పాత్రను షర్మిల పోషించాల్సి ఉంటుంది. గతంలో తాను ఎందుకు అలా చేశాను? ఇప్పుడు ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది? అనే దానిపై ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైయస్ కుటుంబానికి ఏ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని షర్మిల చెప్పారో.. అదే కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. కారణాలు చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఇప్పుడు షర్మిలకు ఎదురైంది.
ప్రధానంగా రాష్ట్ర విభజన అంశం ఆమెకు ప్రతిబంధకంగా మారనుంది. నాటి కాంగ్రెస్ నిర్ణయాలపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ఒక డిక్లరేషన్ తో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు విభజన హామీల అమలు విషయంలో బిజెపి వైఫల్యాలను సైతం షర్మిల గట్టిగా తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క వైసీపీ కాదు టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను సైతం షర్మిల ప్రస్తావించాల్సిన అవసరం కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసిపి ఆరోపిస్తోంది. దానిపై కూడా షర్మిల క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను అవపోషణ పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు రెండు నెలల వ్యవధి ఉండడంతో.. షర్మిల కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే.. బలం పెంచే వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే షర్మిల సమర్థతకు ఇదో అగ్నిపరీక్షే.