Sharmila Son Wedding
Sharmila Son Wedding: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియా అట్లూరి అనే యువతని వివాహం చేసుకోనున్నాడు.వీరిది ప్రేమ వివాహం. గత కొద్దిరోజులుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహ బంధంతో ఒకటి కానున్నారు.
ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. ఈయన చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ కుమారుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే శ్రీనివాస్ తో తమ అధినేతకి కానీ, చట్నీస్ సంస్థతో కానీ ఎటువంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. చట్నీస్ సంస్థ అధినేత చంద్రబాబు అత్యంత దగ్గర బంధువు అని.. ఆ కుటుంబంతో వైయస్ కుటుంబానికి చెందిన వ్యక్తికి వివాహం జరుగుతోందని లేనిపోని ప్రచారం జరిగింది. దీనిని తెరదించుతూ చట్నీస్ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.
నిశ్చితార్థం తో పాటు పెళ్లి వేడుకలకు సంబంధించి ఇరు కుటుంబాల వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 15న నిర్వహించనున్నట్లు సమాచారం. రాజస్థాన్లోని జోద్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2 లేదా 3వ తేదీల్లో హైదరాబాదులో నిశ్చితార్థం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. అందరి దృష్టి సీఎం జగన్ హాజరు పైనే ఉండనుంది.