YS Sharmila: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు( Y S Sharmila ) కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకులు ఎక్కువవుతున్నారు. ఆమె తీరు నచ్చని చాలామంది నేతలు నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. రఘువీరారెడ్డి, చింతా మోహన్ లాంటి సీనియర్లు పార్టీలోనే ఉన్నా.. షర్మిల విషయంలో వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న సీనియర్ నేత సాకే శైలజానాథ్ పార్టీకి దూరమయ్యారు. అదే ఊపులో చాలామంది కాంగ్రెస్ సీనియర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే వారెవరు వెళ్లలేదు. అలాగని కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు. ముఖ్యంగా షర్మిల విషయంలో వారు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అందరికంటే మించి కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ నుంచి షర్మిల సవాల్ ఎదుర్కొంటున్నారు. ఆమె షర్మిల విషయంలో కొరకరాని కొయ్యగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. షర్మిల వ్యతిరేకులను ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
* కాంగ్రెస్ లో సీనియర్ నేత
వాస్తవానికి పద్మశ్రీ( Padmashree ) కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత చాలామంది నేతలు వెళ్లిపోయారు. కానీ పద్మశ్రీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు గా ఉండేవారు. అయితే ఆమె పిసిసి అధ్యక్ష పదవి బలంగా కోరుకున్నారు. సాకే శైలజనాథ్ తర్వాత తనకే బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ ఇంతలో షర్మిల ఆగమనంతో ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి దక్కింది. షర్మిల సైతం పద్మశ్రీని సైడ్ చేయడం ప్రారంభించారు. దీనిని తట్టుకోలేకపోయారు పద్మశ్రీ. అందుకే నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో షర్మిలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. అందుకే షర్మిల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతోంది.
Read Also: రిసార్ట్ లో టాలీవుడ్ సింగర్ బర్త్ డే పార్టీ.. పోలీసుల దాడుల్లో సంచలన నిజాలు!
* దూకుడుగా సుంకర పద్మశ్రీ..
అయితే ఇటీవల సుంకర పద్మశ్రీ దూకుడు పెంచారు. షర్మిలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకులను చేరదీస్తున్నారు. వారందరితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిల సొంత జిల్లా కడపకు( Kadapa ) వెళ్లి ఇటీవల సమావేశం నిర్వహించారు. షర్మిల వ్యక్తిగత అజెండాను బయటపెట్టారు. ఆమెతో పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదు చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు షర్మిలను వ్యతిరేకిస్తున్నారు. షర్మిల బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీకి ఊపు వస్తుందని భావించిన వారు ఉన్నారు. కానీ ఆమె వ్యక్తిగత అజెండాతో.. నిత్యం సోదరుడు జగన్ ను విమర్శించడానికి పరిమితం అవుతున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. అందుకే షర్మిలను వ్యతిరేకించేవారు కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు ఎక్కువవుతున్నారు. వారందరినీ చేరదీసే ప్రయత్నంలో ఉన్నారు సుంకర పద్మశ్రీ.
* వరుస ఫిర్యాదులతో..
మరోవైపు ఎన్నికలకు ముందు షర్మిల పిసిసి అధ్యక్ష( PCC chief ) పదవులు అందుకున్నారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి సరైన విజయం అంటూ దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ తరువాత అటువంటిదేమీ లేకుండా పోయింది. షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత నిర్వీర్యం అయిందన్న వాదనతో చాలామంది నేతలు ఆమెపై హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కాంగ్రెస్ నేతలతో సుంకర పద్మశ్రీ సమావేశం అవుతున్నారు. త్వరలో షర్మిలపై కాంగ్రెస్ హై కమాండ్ వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.