YS Sharmila: సాధారణంగా మహిళలు యాచించి అడిగితే ఎలాంటి వారైనా కరిగిపోతారు. అందునా కష్టంలో ఉన్నామంటే మారు మాట అనకుండా సాయం చేస్తారు. అదే అపాయంలో ఉన్నామంటే వెన్నంటి నిలుస్తారు. వారి సమస్యపై పోరాడుతారు. ఇప్పుడు షర్మిల అలానే అడుగుతుండడంతో కడప జిల్లా ప్రజల్లో ఓ రకమైన చేంజ్ కనిపిస్తోంది. ‘కొంగుచాచి అడుగుతున్నా ఆదరించండి’ అంటూ షర్మిల అడుగుతున్న దృశ్యాలు.. కరుడుగట్టిన వ్యక్తికి సైతం కాసేపు ఆలోచింపజేసేలా ఉన్నాయి.ప్రస్తుతం షర్మిల కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పులివెందులలో ఆమె చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.
ప్రధానంగా షర్మిల వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని తీసుకుని ప్రచారం చేస్తున్నారు. తన వెంట సునీతను తీసుకెళ్లి మరి సెంటిమెంటు రాజేస్తున్నారు. తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న కోసం ఎన్నో రకాల పోరాటాలు చేశానని, శ్రమించానని.. కానీ సోదరుడు జగన్ వీధిన పడేసారంటూ చెబుతున్నారు. అయితే తాము అభిమానించే కుటుంబ ఆడబిడ్డ కోరేసరికి కడప జిల్లా ప్రజలు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఈ సానుభూతి ఓట్ల రూపంలో మారితే తమకు డేంజర్ బెల్స్ తప్పదని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
ప్రజల్లో సెంటిమెంట్ గురించి వైసీపీ నేతలకు తెలిసినంతగా.. మరి ఎవరికీ తెలియదు. సానుభూతి నుంచి వచ్చిన పార్టీయే వైసిపి. మహానేత అకాల మరణం, జగన్ను అకారణంగా జైల్లో పెట్టించారన్న కారణం ఏపీ జనాల్లో ఒక రకమైన సెంటిమెంటును రగిలించింది. ఆ సెంటిమెంటును ఒడిసి పట్టుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అప్పట్లో అదే జగన్ పక్కన సోదరి షర్మిల కూడా ఉన్నారు. ఆ సెంటిమెంట్ ఆస్త్రాలను ఆమె కూడా పసిగట్టారు. ఇప్పుడు అవి ఆస్త్రాలను షర్మిల ప్రయోగిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిన విషయమే. అప్పట్లో విజయమ్మ, షర్మిల దీనంగా ఉన్న పోస్టర్లను కడప జిల్లా వ్యాప్తంగా అతికించారు. అప్పట్లో ఆ సెంటిమెంట్ భారీగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మోసం చేసిన అన్నపై బాధితులుగా మిగిలిన షర్మిల తో పాటు సునీత సెంటిమెంట్ ను ప్రదర్శిస్తున్నారు. ఇది ఓటర్ల పై తప్పకుండా ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
షర్మిల న్యాయం చేయాలన్న దీనమైన విజ్ఞప్తులు ప్రజల్లోకి బలంగా వెళితే మాత్రం వైసీపీకి అపార నష్టమే. అందుకే ఇక్కడ విజయమ్మను ప్రయోగించాలని జగన్ చూశారు. ఆమె ఎటు ఉండలేక అమెరికా వెళ్లిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ తన భార్య భారతిని రంగంలోకి దించారు. తన చెల్లెలు ఇద్దరినీ అడ్డుకునే బాధ్యతను అర్ధాంగికి అప్పగించారు. అయితే ఇలా ప్రచార బాధ్యతలు భారతి తీసుకున్న రోజే.. ఆ ఇద్దరు ఆడపడుచులకు అడ్డంకులు ఎదురయ్యాయి. అంటే మున్ముందు వారిద్దరినీ అడ్డగించేందుకు ఎంత దాకా అయినా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికైతే వైయస్ ఆడబిడ్డలిద్దరూ కొంగు చాచి అడుగుతున్న న్యాయంపై కడప జిల్లా ప్రజల్లో ఆలోచన ప్రారంభమైంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.
సీమ లో సెంటిమెంట్ పని చేస్తుందా?
మీ రాజశేఖర రెడ్డి, వివేకానందరెడ్డి బిడ్డలం… మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం…మీరే న్యాయం చేయండి#YSSharmila pic.twitter.com/NbRmJ7tzcz
— M9 NEWS (@M9News_) April 12, 2024