YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( Y S Sharmila ) దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఈనెల తొమ్మిది నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టునున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన షర్మిల చాలా దూకుడుగా ఉండేవారు. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకునేవారు. కానీ ఇటీవల రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం పై సైతం విరుచుకుపడుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుపై సైతం విమర్శలకు దిగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతుండడం హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: వైసిపి అడ్డాలో ‘మహానాడు’.. ఈసారి ప్రత్యేకత అదే!
* పార్టీ బలోపేతం కోసమే..
షర్మిల నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ( Congress Party) పురోగతి సాధించలేక పోయింది. పార్టీలో ఉన్న సీనియర్లు సైతం దూరమయ్యారు. మొన్న ఆ మధ్యన సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉన్న కొద్దిపాటి సీనియర్లు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. షర్మిల తీరు నచ్చని నేతలు సైతం పార్టీ వైపు చూడడం లేదు. ఒకానొక దశలో షర్మిలను కాంగ్రెస్ బాధ్యతలనుంచి తప్పిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల జిల్లాల పర్యటనకు దిగుతుండడం విశేషం. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో బాధ్యతలను గుర్తు చేసేందుకే.. షర్మిల జిల్లాల పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
* నాలుగు నెలల కిందట జగన్ ప్రకటన..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)జనం బాట పట్టనున్నట్లు కొద్ది నెలల కిందట ప్రకటించారు. జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో వారంలో నాలుగు రోజులు పాటు పర్యటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసి నాలుగు నెలలు అవుతోంది. కానీ అటువంటి సన్నాహాలేవి ప్రారంభం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి విరుగుడుగా వైయస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.
* షెడ్యూల్ ఖరారు..
పిసిసి అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్( schedule) ప్రకటించారు. ఈనెల 9 నుంచి షర్మిల జిల్లా పర్యటనలు మొదలవుతాయి. తిరుపతిలో పర్యటన మొదలుపెట్టి.. విశాఖలో ముగించేలా షెడ్యూల్ ను ఖరారు చేశారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైయస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల,పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో షర్మిల పర్యటనలు ఉండనున్నాయి.
Also Read: ఏపీలో భయానక వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!