YS Sharmila: వైయస్ షర్మిల( Y S Sharmila) మళ్లీ దూకుడు పెంచారు. గత కొద్ది రోజులుగా ఆమె సైలెంట్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విమర్శలు చేయకపోవడంతో ఆమె మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డితో ఆమె రాజీ చేసుకున్నట్లు కూడా టాక్ నడిచింది. అందుకే ఆమె కొత్తగా కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నట్లు అంతా భావించారు. అయితే ఉన్నట్టుండి ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై బాంబు పేల్చారు. ఎప్పుడో చేస్తామంటున్న పాదయాత్ర గురించి ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన వారు పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మరు అని కూడా తేల్చి పారేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. తద్వారా పాదయాత్రలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే సంకేతాలు పంపించారు షర్మిల. గతం మాదిరిగా పాదయాత్రను ప్రజలు ఎంత మాత్రం నమ్మే స్థితిలో లేరని కూడా ఆమె ముందస్తు సంకేతాలు పంపారు. జగన్ పాదయాత్రకు ముందున్న అవరోధాలను గుర్తు చేశారు అయితే ఆ భయం జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది.
* అప్పటి దూకుడు ఉందా?
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam). టిడిపికి 100 స్థానాలు దాటితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరవై స్థానాలు దాటి.. 67 ఫిగర్ వద్ద ఆగిపోయింది. తద్వారా బలమైన పార్టీగా అవతరించింది. అయితే అప్పట్లో ఆ పార్టీ శ్రేణులు దూకుడుగా ఉండేవారు. అదే దూకుడుతో 2017లో పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అప్పట్లో అదో సంచలన ప్రకటన గా మారింది. అదే జగన్మోహన్ రెడ్డి.. అదే ప్రతిపక్షంలో ఉంటూ.. అదే పాదయాత్ర ప్రకటన చేస్తే ఇప్పుడు పెద్దగా సెన్సేషన్ కాలేదు. దానికి కారణం ఇదివరకే ఆయన పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చారు. ఆయన వైఫల్యం చెందడంతోనే కూటమికి జనాలు ఛాన్స్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారు. దానినే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వర్కౌట్ కాదని తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా అదే భయం ఉంది.
* ఆ సమయంలో మాత్రమే వర్కౌట్..
ప్రజల మూడ్ ఎప్పటికప్పుడు మారుతుంది. అలాగని వారిని అన్నివేళలా నమ్మించలేం కూడా. ఏదైనా ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో మాత్రమే పాదయాత్ర చేయాలి. అలా చేసిన పాదయాత్ర వర్కౌట్ అవుతుంది. 2003లో రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) పాదయాత్ర చేసే సమయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజలు నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేక భావనతో ఉండేవారు. ఆ సమయంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. ప్రజలు దానిని గుర్తించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అయితే 2018లో జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక నినాదంతో పాదయాత్ర చేశారు. వన్ చాన్స్ అంటూ ప్రజలను కోరారు. ఆపై కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు విభేదించడాన్ని ప్రజలు తప్పుపట్టారు. ఈ కారణాలతో జగన్మోహన్ రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో అనేక నిర్ణయాలు వివాదానికి దారితీసాయి. అనుకున్నంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షుడు అనిపించుకోలేదు. పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీల కంటే.. ఇవ్వని వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు లోకేష్ పై వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేశారు. ఆయన పాదయాత్ర చేసి తనను తాను నాయకుడిగా నిరూపించుకున్నాడు. పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. అయితే ఇప్పుడు అదే పాదయాత్ర ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు. దీనిపై షర్మిల తాజాగా స్పందించారు. అంత సీన్ లేదన్నట్టు తెల్చేశారు. సొంత సోదరి ఇలా అంటే.. తన పాదయాత్రకు మున్ముందు ఇబ్బందులు తప్పవని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. అయితే ఏడాదిన్నర తరువాత చేయబోయే పాదయాత్ర సవ్యంగా సాగుతుందన్న అనుమానం వైసీపీలో కూడా లేదు. రెండోసారి పాదయాత్ర అంటే ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరన్నది వైసిపి శ్రేణుల అభిప్రాయం. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..