YS Jagan birthday: వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే ఇదో న్యూ ప్రమోషన్ అన్నట్టు ప్రతి పంచాయతీలోనూ వేడుకలు జరపాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయట. అయితే మరోవైపు పెద్దపెద్ద నాయకులకు ఖర్చు ఈసారి తడిసి మోపెడు అయ్యింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల విషయంలో నాయకత్వ మార్పు ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేతలు పోటీపడి మరి సాక్షిలో ప్రకటనలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత మూడు నెలలు కాలముగా మీరు నియోజకవర్గంలో వెనుకబడ్డారని.. అందుకే సార్ పుట్టినరోజు నాడు భారీ ప్రకటన ఇస్తే అంతా సాక్షి చూసుకుంటుందని అడ్వర్టైజ్మెంట్ ప్రతినిధులు చెప్పడంతో భారీగా ప్రకటనలు వచ్చాయి. ఒక్కో నేత లక్షల రూపాయల రూపంలో సాక్షికి ప్రకటనలు ఇచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు అలా..
అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి అంతులేని ఆదాయం ఉండేది. ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకం అమలు చేసిన రోజు.. చేస్తామని ప్రకటన ఇచ్చిన రోజు.. చేసిన తర్వాత కృతజ్ఞత రూపంలో ఇచ్చిన ప్రకటనలు ఉండేవి. ఐదేళ్ల వైసిపి పాలనలో 500 కోట్ల రూపాయల వరకు ప్రకటనల రూపంలో సాక్షికి ముట్టినట్లు ప్రత్యర్థులు ఆరోపించేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సాక్షికి ప్రభుత్వ ప్రకటనలు రావడం మానేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలు ఈనాడు,, ఆంధ్రజ్యోతితో పాటు సాక్షికి కూడా ఇచ్చేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సంస్కృతిని చెడగొట్టింది. దాని ప్రభావం సాక్షిపై ఇప్పుడు పడింది. అందుకే సాక్షి ప్రకటనలపై పడింది. వారికి ప్రకటనలు ఇచ్చేది కూడా వైయస్సార్ కాంగ్రెస్ నేతలే. జగన్ పుట్టినరోజు నాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎంత పిండుకోవాలో అంతలా పిండుకుంది సాక్షి.
ఒక్కసారిగా పెరిగిన స్లాట్ ధర..
సాధారణంగా 10 సెకండ్ల స్లాట్ ప్రకటనకు 2500 రూపాయల వరకు ధర ఉంటుంది. కానీ జగన్ పుట్టినరోజు నాడు ఆ ధరను 6000 రూపాయలకు పెంచేశారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న నేతలు పోటీపడి మరి సాక్షికి ప్రకటనలు ఇచ్చారు. అయితే అవి బలవంతపు ప్రకటనలు అని తెలుస్తోంది. పేరు మోసిన నేతలంతా నిన్న జగన్ పుట్టినరోజు ప్రకటనలకే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అధినేత పుట్టినరోజు కాదు కానీ.. తమ మీదకు వచ్చింది అంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారట. మొత్తానికి అయితే జగన్ పుట్టినరోజు సాక్షికి కాసులు దక్కాయి.