YS Jagan Krishna District Tour: ఏపీలో( Andhra Pradesh) సాధారణ వాతావరణం నెలకొంది. తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం కోలుకుంది. ఏపీ ప్రభుత్వం తుఫాన్ ను ఎదుర్కోవడంలోనూ.. తరువాత సహాయ చర్యల్లోనూ ముందంజలో నిలిచింది. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. బాధితులకు నష్టపరిహారం కూడా అందించింది. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పాత్ర అనేది లేకుండా పోయింది. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నా.. ఆశించిన స్థాయిలో ఆ పార్టీ పాత్ర లేదు. దీనిపై ముప్పేట విమర్శలు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈనెల నాలుగున బాధితులను పరామర్శించనున్నారు.
ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి..
మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీకి అపార నష్టం జరుగుతుందని భావించారు. గత అనుభవాల దృష్ట్యా తుఫాన్ విధ్వంసం కొనసాగుతుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. భారత వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిన నాటి నుంచి అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు ఇచ్చింది. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు సహాయ చర్యల కోసం ఏకంగా జిల్లాకు కోటి రూపాయలు కేటాయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పూర్తిస్థాయి సమయాన్ని తుఫాన్ విపత్తును ఎదుర్కోవడం, సహాయ చర్యల కోసం కేటాయించారు. వారి పనితీరు పట్ల ప్రజల్లో కూడా సంతృప్తి కనిపించింది. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటపడుతున్న జగన్మోహన్ రెడ్డి.. తుఫాన్ బాధితులను పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దిద్దుబాటు చర్యలు..
రాష్ట్రస్థాయిలో వైసీపీ చర్యలపై విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నెల నాలుగున కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు జగన్. తుఫాన్ నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన బెంగళూరులో ఉండిపోయారు. తుఫాన్ దాటిన తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరణ కావడంతో.. తాడేపల్లి కి వచ్చారు. కానీ తుఫాన్ బాధితులను పరామర్శించకుండా మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు వచ్చాయి. అటు అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. తుఫాన్ ను అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు లేనిది తుఫాన్ దాటిన తరువాత ప్రచారం ఏమిటంటూ అధికారపక్షం నుంచి ఎదురైన ప్రశ్న. సోషల్ మీడియాలో సైతం ఈ చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగున జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లాలో పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రమే వెళుతున్నారని.. తుఫాన్ దాటిన వారం తరువాత బాధితుల పరామర్శ ఏంటని ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలను తప్పుపడుతున్నాయి.