KTR clarity: సరిగ్గా 2023 సంవత్సరంలో అప్పటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు చేసిన కృషి విశేషంగా ఉంది కాబట్టి.. ఇక్కడ ఐటి ఉద్యోగులు కూడా వారాంతాలలో నిరసనలు వ్యక్తం చేశారు. టిడిపి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఒక కామెడీ షో చూసి తాను విపరీతంగా నవ్వుకున్నానని అందులో పేర్కొన్నారు. దీనిని టిడిపి.. ఇతర పార్టీల నాయకులు వేరే కోణంలో చూశారు. తమకు నచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత ఇది భారత రాష్ట్ర సమితికి తీవ్రమైన డ్యామేజ్ చేసింది. ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో కేటీఆర్ ను సీనియర్ జర్నలిస్టులు వేమూరి రాధాకృష్ణ నుంచి మొదలుపెడితే అనేక మంది అడిగారు. దానికి ఆయన ఎలాంటి సమాధానం చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో కొన్ని మీడియా సంస్థలు కేటీఆర్ అలా వ్యవహరించడం వల్లే 2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు..
ఇక నాడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. ఇక్కడ నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ స్పందించారు. ఎక్కడో ఏపీలో జరిగిన పంచాయతీని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సహజంగానే కొన్ని మీడియా సంస్థలు ఈ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. దీంతో కేటీఆర్ మీద నెగటివ్ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఇది తారస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు మీద తాను ఎటువంటి నెగటివ్ ప్రచారం చేయలేదని.. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయనే తను బాధ్యతాయుతమైన ఐటీ శాఖ మంత్రిగా ఈ వ్యాఖ్యలు చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు అంటే తనకు విపరీతమైన గౌరవం ఉందని.. ఆయన అరెస్టు అయినప్పుడు నారా లోకేష్ తో తను మాట్లాడానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ న్యూస్ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పారు.. తనకు చంద్రబాబు అంటే విపరీతమైన గౌరవం ఉందని.. ఆయన అరెస్ట్ అయినప్పుడు తాను నారా లోకేష్ తో మాట్లాడానని.. నేను చేసిన వ్యాఖ్యలను మరో విధంగా వక్రీకరించారని.. దానివల్ల నామీద లేనిపోని నెగిటివ్ ప్రచారం చేశారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.