Jogi Ramesh arrest: రాజకీయాల్లో ( politics) దూకుడు తనం కొంతవరకే పని చేస్తుంది. మితిమీరిన దూకుడుతో చేటు ఎక్కువ. ఇప్పుడు అటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ బిసి సామాజిక వర్గానికి చెందిన నేత. కృష్ణా వంటి జిల్లా నుంచి హేమా హేమీలైన నేతలు ఉన్నారు. అటువంటి వారిని కాదని జోగి రమేష్ ఆ జిల్లా రాజకీయాల్లో ప్రవేశించడమే కాదు శాసించారు కూడా. అయితే దానికి ఎంతో దూకుడు కనబరిచారు. కానీ వైసీపీ హయాంలో ఆ దూకుడు కాస్త అతి చేశారు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయితే గత 17 నెలల్లో అనేక రకాల పరిణామాలు జరిగాయి. అధికార కూటమితో రాజీ చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ గత అనుభవాల దృష్ట్యా కూటమి జోగి రమేష్ విషయంలో జాగ్రత్త పడింది. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ఆలోచన పై కూటమి పెద్దలు సీరియస్ గా ఉన్నారు. బలమైన ఆధారాలతో అరెస్ట్ అయిన జోగి రమేష్ ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
ఆ ఒక్క ఘటనతో మంత్రి పదవి..
2019 ఎన్నికల్లో వైసీపీ( YSR Congress party ) తరఫున గెలిచారు జోగి రమేష్. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. తాను దూకుడు తనం ప్రదర్శిస్తే కానీ పదవి దొరకదని భావించారు. సరిగ్గా మంత్రివర్గ విస్తరణ ముందు దాదాపు 100 వాహనాలతో.. చంద్రబాబు ఇంటి పై దండయాత్ర చేశారు జోగి రమేష్. చంద్రబాబు ట్రాక్ రికార్డును కూడా లెక్క చేయలేదు. ఆయన ఈ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అన్న విషయాన్ని కూడా గ్రహించలేదు. భారతదేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అని చూడలేదు. ఏకంగా ఆయన ఇంటిపై దండయాత్ర చేసేసరికి జోగి రమేష్ కు ఎనలేని గుర్తింపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇచ్చేసరికి జోగి రమేష్ కిందా మీదా చూడలేదు. నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తూటాల పేలేది. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి కొనసాగించేవారు. కేవలం బీసీ నేత అనే ట్యాగ్ లైన్ తో.. జగన్ కలకాలం ముఖ్యమంత్రి అని భావించి చాలా రకాలుగా ప్రత్యర్థులను వెంటాడారు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు.
కూటమికి దగ్గరయ్యేందుకు..
వైసీపీ హయాంలో తాను ఎలా ప్రవర్తించారో జోగి రమేష్( Jogi Ramesh) కు తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రకాల జాగ్రత్తలు పడ్డారు. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే అగ్రిగోల్డ్ భూములు కొట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై విచారణ మొదలెట్టింది. జోగి రమేష్ కుమారుడు తో పాటు కుటుంబ సభ్యులు కూడా అరెస్టు అయ్యారు. అది మొదలు ఆయనలో ఆందోళన ప్రారంభం అయింది. దీంతో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో.. మంత్రి కొలుసు పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీష తో వేదిక పంచుకున్నారు. కూటమికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ జోగి రమేష్ చర్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు. దీంతో దానిని అడ్డుకోగలిగారు. అయితే పరిస్థితి అదుపుతప్పుతోందని జోగి రమేష్ కు సైతం తెలుసు. అందుకే మొన్న ఆ మధ్యన తనకు తాను స్వచ్ఛందంగా నాడు చంద్రబాబు సతీమణి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసింది తప్పు అని మాట్లాడారు. ఈ విషయంలో తన భార్య కూడా తనను ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా చంద్రబాబుకు తనపై ఉన్న కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.
నాయకత్వాన్ని నమ్మించాలని..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జోగి రమేష్ ఎంతో లబ్ది పొందారు అన్నది వైసిపి నాయకత్వానికి ఉన్న అభిప్రాయం. కానీ అధికారానికి దూరమైన తర్వాత.. అధికార కూటమికి భయపడి జోగి రమేష్ చేసిన ప్రయత్నాలు నాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కనీసం జోగి రమేష్ ను పట్టించుకోలేదు కూడా. ఒకానొక దశలో జోగి రమేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా ప్రచారం నడిచింది. అటు కూటమి చేరదీయకపోవడం, వైసీపీ నాయకత్వంలో అనుమానం పెరగడంతో జోగి రమేష్ లో ఆందోళన మొదలైంది. దీంతో నాయకత్వానికి నమ్మించాలంటే ఏదో ఒక పని చేయాలి. అలా కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. అది బెడిసి కొట్టడంతోనే ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు జోగి రమేష్. అయితే ఈ కేసులో ఆయన బయటపడతారా? ఇప్పట్లో బెయిల్ లభిస్తుందా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..