YS Jagan Digital Book: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కూటమి టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకు సంబంధించి ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెడుతున్న విషయం చర్చకు వచ్చింది. అటువంటి వారిపై వచ్చే సమావేశాల నాటికి అనర్హతా వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ రోజు తాడేపల్లిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. టీడీపీ రెడ్ బుక్ మాదిరిగానే డిజిటల్ బుక్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు.
అప్పట్లో లోకేష్ రెడ్ బుక్..
టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడింది వైసీపీ ప్రభుత్వం. చివరకు కుప్పంలో చంద్రబాబును సైతం విడిచిపెట్టలేదు. యువగళం ప్రారంభించిన లోకేష్ కు అడుగడుగునా చుక్కలు చూపించారు. అయినా వెనక్కి తగ్గని లోకేష్ ఒక రెడ్ బుక్ తో కనిపించేవారు. ఈ క్రమంలో యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాలో టీడీపీ శ్రేణులను ఇబ్బండిపెట్టిన ప్రతిఒక్కరి పేర్లు రాసుకుంటున్నానని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఎందుకంటే వైసీపీ నేతల వరుస అరెస్టులుతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది.
డిజిటల్ బుక్ ఆవిష్కరణ
అయితే రెడ్ బుక్ మాదిరిగా మనం కూడా ఒక బుక్ రాసుకొందామని వైసీపీ నేతలు కోరడంతో డిజిటల్ బుక్ ప్రారంభించారు జగన్. ఈ రోజు తాడేపల్లిలో పార్టీ నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు జగన్. ప్రతిఒక్కరి వివరాలు డిజిటల్ బుక్ లో రాయాలని.. ఆధారాలుంటే నమోదు చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సప్త సముద్రాల అవతల ఉన్నా తెచ్చి శిక్షిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తగ్గేదేలే..వదిలేదిలే అంటూ తేల్చిచెప్పారు. వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చిన వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. జగన్ హెచ్చరికలను వైసీపీ సోషల్ మీడియా విభాగం వైరల్ చేస్తోంది.
YSRCP Digital Book Launch ✊
మనం అధికారంలోకి వచ్చాక.. మన కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది ఉండదు
Link https://t.co/rWquOczn07#YSRCPDigitalBook #YSRCP #AndhraPradesh #JaganannaConnects pic.twitter.com/yKrKziEnDj
— Jagananna Connects (@JaganannaCNCTS) September 24, 2025