https://oktelugu.com/

YSR Congress : విజయసాయిరెడ్డి లేని లోటు తీర్చేది ఆ నేతే.. జగన్ సంచలన నిర్ణయం!

జగన్( Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి బయటకు వెళ్లడంతో ఆయన స్థానాన్ని మరో నేతకు అప్పగించారు.

Written By: , Updated On : January 31, 2025 / 11:02 AM IST
Peddireddy Mithun Reddy

Peddireddy Mithun Reddy

Follow us on

YSR Congress : వైసీపీకి( YSR Congress) విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవి కూడా వదులుకున్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాదాపు ఆయన శకం వైసీపీలో ముగిసినట్టే. తరువాత ఎప్పుడో ఏదో కారణాలు చూపుతూ ఎంట్రీ ఇవ్వచ్చు కానీ.. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి వైసీపీలో లేనట్టే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద లోటు. ఎందుకంటే జాతీయస్థాయిలో ఏ చిన్న అవసరం పడినా ఇట్టే పూర్తి చేసేవారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వైసీపీలో ఆ పాత్ర పోషిస్తారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. జాతీయస్థాయిలో వైసీపీకి కేరాఫ్ అడ్రస్ కూడా విజయసాయిరెడ్డి. పార్టీ తరఫున అధికారిక, అనధికారిక సమావేశాల్లో ఆయన పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన పక్కకు వెళ్లిపోవడంతో ఢిల్లీలో కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీసుకున్నట్లుగా ఉన్నారు.

* పార్లమెంటరీ పార్టీ నేతగా
ఎన్నికల్లో వైసీపీ( YSR Congress ) నుంచి నలుగురు లోక్సభ సభ్యులుగా గెలిచారు. అందులో మిధున్ రెడ్డి ఒకరు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై గెలిచారు. కడప ఎంపీ గా అవినాష్ రెడ్డి సైతం గెలిచారు. తిరుపతి నుంచి గురుమూర్తి విజయం సాధించారు. అరకు పార్లమెంట్ స్థానాన్ని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. నలుగురు లోక్సభ సభ్యులతో పాటు 11 మంది రాజ్యసభ సభ్యులకు కలిపి.. వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. లోక్సభలో వైసిపి పక్ష నేతగా మిథున్ రెడ్డి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డిని నియమించారు. టోటల్ గా పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రం వై వి సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే అప్పటివరకు విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండగా.. ఆయనను మార్చడంతోనే అసంతృప్తి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

* విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టం
అయితే ఇప్పుడు జాతీయస్థాయిలో విజయసాయి రెడ్డి ( Vijaya Sai Reddy )లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మీటింగ్ కు వైవి సుబ్బారెడ్డి హాజరు కావాలి. కానీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. ఇలా గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించుకునేవారు. ఆయన పక్కకు వెళ్లడంతో ఇప్పుడు మిధున్ రెడ్డి వచ్చారు. అచ్చం అవే మాటలు చెబుతున్నారు. దీంతో వైసిపి జాతీయ వ్యవహారాలు మిథున్ రెడ్డికి అప్పగించినట్లు టాక్ ప్రారంభం అయ్యింది. వాస్తవానికి మిథున్ రెడ్డి జగన్కు అత్యంత నమ్మకమైన నేత. ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేశారు.

* పట్టు నిలుపుకున్న పెద్దిరెడ్డి కుటుంబం
ఎన్నికల్లో పెద్దిరెడ్డి( peddy Reddy ) కుటుంబమంతా గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. కానీ పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు మిధున్ రెడ్డి గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి కుటుంబం తన పట్టును నిలుపుకుంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం పట్టుకుని నిలబడింది అంటే నిజంగా ఆ కుటుంబానికి బలం ఉంది. అందుకే జగన్ సైతం ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసిపి జాతీయ అవసరాలు తీర్చడంలో మిధున్ రెడ్డి సక్సెస్ అవుతారో లేదో చూడాలి.