https://oktelugu.com/

YS Jagan : నాకు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు.. ఇంతకీ ఏమైంది ?

చంద్రబాబు హయాంలో చేసుకున్న గాలి, సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల ఏపీకి అదనపు భారం పడిందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అదనంగా రూ.3.41 చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Written By:
  • Rocky
  • , Updated On : December 2, 2024 / 04:58 PM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan :  కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్‌ఈసీఐతో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేసి తన ప్రతిష్టను దిగజార్చుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అదానీ తనకు భారీగా లంచం ఇచ్చారని ఈ రెండు పత్రికలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మాట్టాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ధరకు కరెంటు ఒప్పందం కుదుర్చుకున్నా.. దానిపై కూడా బురదజల్లుతూ రాయడం ఏంటని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న గాలి, సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల ఏపీకి అదనపు భారం పడిందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అదనంగా రూ.3.41 చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబరు 15, 2021న సేకి నుంచి తీపి సందేశాలతో కూడిన లేఖ వచ్చిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ చర్యలను, రైతులపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ మెచ్చుకున్నారని ఆయన తెలిపారు.

    అత్యంత చౌకగా కేవలం యూనిట్‌ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్‌ కొనుగోలు చేస్తూ తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైసీపీ నేత వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాదులు శనివారం లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని, థర్డ్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆది నుంచి తమ క్లయింట్‌ స్పష్టం చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. సెకీ ఐఎస్‌టీఎస్‌ చార్జీలు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే సదరు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాల్లేకుండా తమ క్లయింట్‌ ప్రతిష్టను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్ ల మధ్య పారదర్శకంగా జరిగిన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. అది కూడా ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.

    ఈ కథనాల కారణంగా తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు వండివారించారని వాపోయారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్‌, అలాగే ఈనాడు ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్‌, అలాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ఎన్‌.రాహుల్‌ కుమార్‌లకు వైఎస్‌ జగన్‌ తరఫు లాయర్లు లీగల్‌ నోటీసు జారీ చేశారు. కానీ ఈ నోటీసుల్లో ఎక్కడా కూడా జగన్ చెప్పినట్లు రూ.100కోట్ల పరువు నష్టం దావా అన్న విషయం లేదు. అలాగే అదానీ కంపెనీ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో రూ.1750కోట్లు లంచగా ఏపీలోని అప్పటి ప్రభుత్వాధినేతకు ఇచ్చినట్లు ఆరోపించింది ఇక్కడ కాదు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్. ఈ మేరకు అమెరికాలోని కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జగన్ కు లంచం ఇచ్చినట్లుగా జాతీయస్థాయి పత్రికలు కూడా ప్రచురించాయి.. మరి ఆయన ఎందుకు వాటికి లీగల్ నోటీసులు ఇవ్వలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాల్లో వచ్చిన కథనాలనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ప్రచురించాయి కాబట్టి.. జగన్ కోర్టుకు వెళ్లినా గెలిచే ఛాన్స్ లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.