Homeఆంధ్రప్రదేశ్‌YS Jaganmoham Reddy : అవే ‘ఈవీఎం’ అనుమానాలు.. హర్యానా ఫలితాలపై జగన్ మరో సంచలన...

YS Jaganmoham Reddy : అవే ‘ఈవీఎం’ అనుమానాలు.. హర్యానా ఫలితాలపై జగన్ మరో సంచలన ట్వీట్

YS Jaganmoham Reddy : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి 40 శాతం ఓటు బ్యాంకు సంపాదించుకుంది. కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అధికారం లభించాల్సిన చోట కేవలం 11 సీట్లు దక్కించుకోవడం వెనక ఈవీఎంలలో మతలబు జరిగి ఉంటుందని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తొలి రోజు నుంచే వైసిపి “ఈవీఎం రాగం” అందుకుంది. అప్పట్లో మాజీమంత్రి రోజా ఒక అడుగు ముందుకేసి “జనసేన పోటీచేసిన అన్ని సీట్లలో గెలవడం ఏంటి? భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయాలు సాధించడం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు రావడం ఏంటి? 40 శాతం ఓట్లు దక్కించుకున్న వైసిపి 11 సీట్ల వద్దే ఆగిపోవడం ఏంటి” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈవీఎం సీఎం అంటూ చంద్రబాబుపై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ఏపీలో ఓట్ల లెక్కింపు, మెజారిటీ, దక్కిన సీట్లపై తనదైన విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. తన ఛానల్, పత్రికలో ఈవీఎం లపై రకరకాల కథనాలు ప్రసారం చేస్తూనే ఉన్నారు. అయితే దీనిని కూటమినేతలు సమర్థవంతంగానే తిప్పి కొడుతున్నారు. తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆయాచిత వరం లభించినట్టయింది.

హర్యానా ఎన్నికల ఫలితాలపై..

హర్యానా రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా అక్కడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు ఆందోళనలు చేశారు. జాట్లు ఉద్యమాలు చేశారు. రెజ్లర్లు నిరసన బాట పట్టారు. చివరికి హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బిజెపి అధికారంలోకి రాదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వెల్లడించే రోజు తొలి రౌండ్ లో కాంగ్రెస్ స్పష్టమైన లీడ్ చూపించింది. ఆ తర్వాత బిజెపి సత్తా చాటడం ప్రారంభమైంది.. మ్యాజిక్ ఫిగర్ దాటి ఏకంగా రెండు స్థానాలను అధికంగా గెలుచుకుంది. ఈ పరిణామం బిజెపినే కాదు, ఇతర పార్టీలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక రాజకీయ విశ్లేషకులయితే ఈ ఫలితాలను చూసి మక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇదే ఫలితాలను జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఇటీవల ప్రకటించిన ఎన్నికల ఫలితాలకు ముడివేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. సంచలన ట్వీట్ చేసి.. బిజెపి, భారత రాష్ట్ర సమితి మినహా మిగతా అన్ని పార్టీలను ట్యాగ్ చేశారు.

బయటికి వచ్చేసినట్టే..

అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేన పై ఆగ్రహంగా ఉండేవారు. అదే సమయంలో బిజెపిపై కాస్త మెతక వైఖరి అవలంబించేవారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ మొహమాటాన్ని వదిలేసినట్టు వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని ఆయన బిజెపిపై యుద్ధం ప్రకటించారని అంటున్నాయి.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్ ఎక్స్ వేదికలో జగన్ స్పందించారు..” ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలో మాదిరిగానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై కోర్టులలో ఇప్పటికే కేసులు కొనసాగుతున్నాయి. భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి. ఆ ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. మనం కూడా పేపర్ బ్యాలెట్ వైపు వెళ్తేనే ఓటర్లలో విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపడానికి చట్టసభ సభ్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని” జగన్ సంచలన ట్వీట్ చేశారు..

సంచలనంగా ట్వీట్..

ఈ ట్వీట్ తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే 40 శాతం ఓటు బ్యాంకు వచ్చినప్పటికీ స్వల్పతేడా తోనే వైసిపి కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని వైసిపి అగ్ర నాయకులు కూడా అంగీకరించారు. కానీ అధికారం పోయిన నాటి నుంచి ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నాయకులు ఈవిఎం విధానాన్ని ఎండగడుతున్నారు. 2019లో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకుంది. ఏపీ రాజకీయాలలోనే సునామీని సృష్టించింది. అప్పుడు ఈవీఎంలను నమ్మిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు నమ్మడం లేదని.. అధికారం పోయింది కాబట్టి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు. “అధికారం లేదనే బాధ జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఈవీఎం హ్యాక్ చేయడం కుదరదు. ఇదే విషయాన్ని అనేకమంది నిపుణులు చెప్పారు. ఈవీఎం అనేది ఎలక్ట్రానిక్ పరికరం. దానిని హ్యాక్ చేయడం కుదరదు. ఎందుకంటే దానికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఆ విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ వైసీపీ శ్రేణులకు అర్థం కావడం లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని” కూటమి నాయకులు మండిపడుతున్నారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలుడైన తర్వాత విమర్శలు చేయగా… ఒక్కరోజు గ్యాప్ లోనే జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఆరోపణలు చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular