YS Jagan: ఎదుటి వారిపై విమర్శలు చేసే ముందు.. మనం ఎలా ఉన్నామో గ్రహించాలి. ఒక వేలితో చూపిస్తే.. పది వేళ్ళు మన వైపే చూపించే రోజులు ఇవి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీది అదే పరిస్థితి. అమ్మ పెట్టదు.. తిననివ్వదు అన్నట్టు ఉంది ఆ పార్టీ దుస్థితి. తుఫాన్ తో ఏపీ అల్లాడిపోతోంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తన వయస్సును లెక్కచేయకుండా ప్రజలను విపత్తు నుంచి కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవకపోయినా పర్వాలేదు. కానీ నిందించే ప్రయత్నం మాత్రం చేయకూడదు. చంద్రబాబు ప్రచార యావతో ఇదంతా చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతుంది.ఇంత జరుగుతుంటే మీ అధినేత ఎక్కడ అంటే మాత్రం సమాధానం కరువవుతోంది.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
* అందరూ తుఫాన్ సహాయ చర్యల్లో..
ప్రస్తుతం ఏపీలో తుఫాను ముప్పు కొంతవరకు దాటినట్లు తెలుస్తోంది. ఒక్క సీఎం చంద్రబాబు( CM Chandrababu) కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సైతం అదే పనిలో ఉన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు తమ స్థాయిలో కష్టపడుతున్నారు. సొంత జిల్లాలతో పాటు నియోజకవర్గాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి ఉపద్రవం ఎదురు ఎదురొచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న జగన్మోహన్ రెడ్డి కనిపించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే అధికార పార్టీతో సమానంగా సేవలందించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
* రోడ్డు మార్గంలో రావచ్చు కదా
ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). తాడేపల్లి కి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే రాలేకపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రద్దయినవి కేవలం విమాన సర్వీసులు మాత్రమే. ఆయన రావాలంటే రోడ్డు మార్గంలో రావచ్చు కదా? కారులో ఓ 6 గంటలు ప్రయాణిస్తే చేరుకోగలరు కదా? అనే ప్రశ్నలు లాజికల్ గా వినిపిస్తున్నాయి. ఎక్కడైనా బలప్రదర్శనలకు, జన సమీకరణలకు దిగాలంటే ఇట్టే ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి.. పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా… ఎన్నెన్ని అడ్డంకులు సృష్టించినా దాటి వెళ్ళిపోతారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ తెగువ ఎందుకు ప్రదర్శించడం లేదు అన్నది ప్రశ్న.