YS Bharathi
YS Bharathi: పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా విపక్షాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విమర్శలు గుప్పించాయి. అయినా సరే ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అదే ప్రచార అస్త్రంగా మారింది. అయితే దీనిపై అధికార పక్షంలో కూడా అసంతృప్తి ఉంది. తాజాగా అది బయటపడింది. కడప జిల్లాలో సీఎం జగన్ సతీమణి భారతి ఎదుటే సొంత పార్టీ నేత తన అసంతృప్తిని వెలిబుచ్చారు. అందరి ముంగిట బాహటంగానే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది.
ఇటీవల పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి భారతి చూస్తున్నారు. ఇప్పటికే కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. పులివెందులలో సైతం సవాల్ చేస్తున్నారు.ఈ తరుణంలో పులివెందులలో గత ఎన్నికల మాదిరిగా ధీమాగా ఉంటామంటే కుదిరే పని కాదు.అందుకే అక్కడ ప్రచార బాధ్యతలను భారతికి అప్పగించారు జగన్.ఈనెల 11 వరకు ఆమె పులివెందులలో ఉండి జగన్కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఆమె పులివెందుల నియోజకవర్గంలో వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.
వేంపల్లి లో పర్యటిస్తుండగా భారతికి మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.’ మా తాతల కాలం నుంచి వారసత్వంగా ఇచ్చే భూములు పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు ‘? అని నిలదీసినంత పని చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని.. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అక్కడితో ఆగకుండా సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా ఎస్టి, నా బిసి, నా మైనారిటీ అంటున్నారే తప్ప.. ఒక్కసారి కూడా రైతన్న అని అనడం లేదని కూడా వ్యాఖ్యానించారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16 వేల లో సగం సొమ్ము కేంద్రానిదేనని.. దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించేసరికి భారతి తో పాటు వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. భారతి మౌనం పాటించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి భారతి అక్కడి నుంచి జారుకున్నారు. ప్రస్తుతం ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.