Rushikonda Palace: విశాఖ( Visakhapatnam) రుషికొండ నిర్మాణాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీ నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి ఎందుకు నిర్మించారో చెప్పే పరిస్థితి లేదు. అయితే ఈ నిర్మాణాలపై అడ్డగోలుగా మాట్లాడేవారు వైసిపి నేతలు. కానీ ఎక్కడ అధికారిక ప్రకటన ఉండేది కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం అయితే తప్పేంటి? క్యాంప్ ఆఫీస్ అయితే వచ్చే నష్టం ఏంటి? అని అడ్డగోలుగా మాట్లాడేవారు. అయితే విశాఖకే ల్యాండ్ మార్క్ గా నిలిచే రిషికొండను బోడి గుండు చేయడం ఎవరికీ నచ్చలే. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాత పెట్టారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాణాలను ఎలా వాడుకోవాలో కూడా కూటమి ప్రభుత్వానికి తెలియడం లేదు. ఆ నిర్మాణాలకు చేసిన ఖర్చు.. ఆ భవనాల నిర్వహణ అనేది ఇబ్బందికరమే. అందుకే ఎలా వాడుకోవాలో తెలియక ప్రజాభిప్రాయాన్ని కోరింది ప్రభుత్వం.
* రిసార్టులు తొలగించి..
విశాఖ రుషికొండ ( rushikonda )అంటే ప్రముఖ పర్యాటక కేంద్రం. దానిపై పెద్ద పెద్ద రిసార్ట్లు ఉండేవి. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అయితే ఆ నిర్మాణాలన్నింటినీ తొలగించారు జగన్మోహన్ రెడ్డి. రిసార్టులను తొలగించి ఆదాయాన్ని పడేశారు. పైగా వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేశారు. భారీ భవంతులను నిర్మించారు. 2024లో మరోసారి అధికారంలోకి వస్తామని.. ఈ భవంతులనుంచే పాలన సాగిస్తామని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఒకటి తలిస్తే.. జనాలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణంగా ఓడించడంతో రుషికొండ నిర్మాణాలు బేల చూపులు చూడడం ప్రారంభించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రూపాల్లో వాటిని వినియోగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే వైసిపి పాపం కూటమికి శాపం కాకూడదని భావించిన చంద్రబాబు సర్కార్ వాటి వినియోగానికి అనేక రకాల ఆలోచనలు చేసింది. ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం పర్యాటక శాఖా పరంగా వినియోగించాలని సూచించారు.
* పర్యాటకానికి ఊతం..
విశాఖ అంటేనే పర్యాటక( tourism), ఆతిథ్యనగరం. ఇక్కడకు వచ్చేందుకు పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే రుషికొండ నిర్మాణాలను పర్యాటక శాఖ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆదాయ వనరులు పెరగడమే కాకుండా పర్యాటకంగా విశాఖ అభివృద్ధి చెందుతుంది. ఆన్లైన్ లో ప్రజాభిప్రాయాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం.. త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి..రుషికొండ నిర్మాణాలపై ఒక తుది నిర్ణయానికి రానుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఆ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికైతే రుషికొండ భవనాల వినియోగం అలా చేస్తారన్నమాట.