Yogi Adityanath treatment in AP: సరైన ట్రీట్మెంట్ ఇస్తే కానీ కొందరు దానికి రారు. అయితే అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సైతం అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. గ్యాంగ్ స్టర్స్ తో పాటు రౌడీ షీటర్ లను ఏరి పారేశారు. ఈ క్రమంలో పొలిటికల్ గా కూడా కొన్ని రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో సంఘవిద్రోహశక్తులను ఏరిపారేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే అటువంటి ట్రీట్మెంట్ ఏపీలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు పోలీసుల దూకుడు చూస్తుంటే మాత్రం అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా రాజకీయం మాటున ఉన్న రౌడీ షీటర్లకు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు పోలీసులు. గుంటూరు జిల్లాలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో నిర్వహించిన పోలీస్ మార్కు కౌన్సిలింగ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
హింసాత్మక డైలాగులతో
ఇటీవల రఫ్ఫా రఫ్ఫా డైలాగ్ పీక్స్ కు చేరింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్లుకు బలి ఇచ్చినట్టు అంటూ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది. దానిని పట్టుకొని ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ హల్చల్ చేస్తోంది. అధినేత పుట్టినరోజు అయినా.. పార్టీ కార్యక్రమం అయినా ఆ స్లోగన్ వినిపించడం ప్రారంభించింది. మరోవైపు గర్భిణీలను కాలితో తన్నడం, కార్లతో మనుషులను గుర్తించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే అన్ని వేళల్లో పోలీసులు ఉండరు. అందుకే పోలీసు పరమైన ట్రీట్మెంట్ ఇస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించారు. అందుకే గుంటూరు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. సాధారణ కౌన్సిలింగ్కు పిలిచారని భావించిన రౌడీషీటర్లకు అక్కడకు వచ్చేసరికి షాక్ తగిలింది.
వందమంది రౌడీషీటర్లతో పరేడ్..
గుంటూరులోని లక్ష్మీపురం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరీసా విగ్రహం వరకు రౌడీషీటర్లతో పరేడ్ నిర్వహించారు. చెప్పులు లేకుండా నడిరోడ్డుపై నడిపిస్తూ చేసిన ఈ ప్రదర్శన రౌడీయిజంపై పోలీసుల ఉక్కు పాదానికి నిదర్శనంగా నిలిచింది. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఏపీ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయగలిగారు. ఇదంతా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీవ్యాప్తంగా రౌడీ షీటర్లకు ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధపడుతోంది. మొత్తానికైతే శాంతిభద్రతల పరిరక్షణలో ఇదో కీలక పరిణామమే.