YCP senior leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికీ కూటమి దూకుడు కొనసాగుతూనే ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కూటమి ఆడుతున్న పొలిటికల్ గేమ్ తో జగన్ విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ నుంచి తగిన సహకారం అందడం లేదు. ఎంతవరకు పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే వీరిపై రాజకీయంగా వివాదాస్పద ముద్ర ఉంది. వీరు ఏది చెప్పినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చారన్న అపవాదు ఉంది. ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు. ఇకనుంచి మరో ఎత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి శ్రేయోభిలాషులు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను పార్టీలోకి రప్పించడం ద్వారా.. కూటమి హవాకు బ్రేక్ వెయ్యాలని చాలామంది సన్నిహితులు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.
సన్నిహిత నేతలు బయట..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి( Y S Rajasekhara Reddy ) అత్యంత సన్నిహితులుగా మెలిగిన చాలామంది ఇంకా బయటే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు. తటస్తులుగా ఉన్నవారు ఉన్నారు. వారంతా చంద్రబాబు నాయకత్వాన్ని నిత్యం వ్యతిరేకిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి పై అభిమానం ఉన్న ఆయన వద్దకు చేరలేని పరిస్థితి వారిది. కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని భావిస్తుంటారు. ఈ జాబితాలో ఉన్న వారి పేర్లు చాలా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, కెవిపి రామచందర్రావు, హర్ష కుమార్, పల్లం రాజు లాంటివారు వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. కానీ జగన్ వెంట నడవలేదు. జగన్ సైతం వారి విషయంలో తేలిగ్గా తీసుకున్నారు. జూనియర్లతో రాజకీయం నడిపించారు. ఇప్పుడు కూటమి ఊపు చూస్తుంటే.. జూనియర్లతో అయ్యే పని కాదని.. సీనియర్ల సహాయం తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు ప్రచారం నడుస్తోంది.
సానుకూల వ్యాఖ్యలు..
రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఆయన కూటమి ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు తీరును తప్పు పట్టారు. కానీ ఆ ఘటన తరువాత తనకు దుర్భాషలాడుతూ ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీ సీనియర్లు ఉండవల్లి అరుణ్ కుమార్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీ లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి తగిన గౌరవం ఇస్తారని.. విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఆయన విశ్లేషణలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయి అన్న విమర్శ ఉంది. అయితే తిరిగి రాజకీయాల్లోకి రావడంపై చాలా విముఖత గా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఆయనను రప్పించేందుకు భారీగానే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా నేత ఒక్కరూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు జీవి హర్ష కుమార్ సైతం సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. పల్లం రాజు మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు. జగన్ జనంలోకి రానున్న క్రమంలో ఈ చేరికల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.