YCP: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. కూటమికి చెందిన 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు మూడు పార్టీలకు చెందిన వారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో 24 మంది మంత్రులు కొనసాగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారు సభకు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు హాజరయ్యేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. అయితే అది తమ పరిధిలో లేదని.. ప్రతిపక్ష హోదాకు తగ్గ బలం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు హాజరై.. అధికార పక్షానికి ధీటుగా మాట్లాడితే చూడాలని ఏపీ యావత్ చూస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరవుతూ వచ్చారు. అయితే వారి రాలేని లోటును పిల్లలు భర్తీ చేయనున్నారు. ఈనెల 26న వైసీపీ తరఫున తమ వాయిస్ వినిపించనున్నారు. అయితే అది పార్టీ పరంగా కాదు.. ప్రజా సమస్యలపై గళం ఎత్తనున్నారు.
* రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నాడు..
ఈనెల 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఆరోజు అసెంబ్లీ స్టూడెంట్స్ సెషన్ ( assembly students session ) నిర్వహించనున్నారు. రాజ్యాంగం తో పాటు శాసన విధులు, పాలనాపరమైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కొద్దిరోజుల కిందట పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు అనుమతి కోరారు. కేవలం పాఠ్యాంశాల బోధన కాకుండా.. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచవచ్చని భావించారు. అందుకు తగ్గట్టు ఈ స్టూడెంట్స్ సెషన్స్ ఏర్పాటు చేశారు. 26న ఉదయం శాసనసభ ప్రాంగణంలో.. విద్యార్థులతో ఈ శాసనసభ జరగనుంది.
* అచ్చం అసెంబ్లీ మాదిరిగా..
175 మంది విద్యార్థులను.. ఎమ్మెల్యేలుగా ప్రమోట్ చేయనున్నారు. ముందుగా ప్రోటెం స్పీకర్ను( protem speaker) ఎన్నుకుంటారు. అనంతరం ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇందులో సగం మంది బాలురు.. సగం మంది బాలికలు. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి విద్యార్థుల కేటాయింపు ఉంటుంది. జీరో అవర్ తో పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా కేటాయించనున్నారు. ఆపై మంత్రులుగా కొంతమంది సమాధానాలు చెబుతారు. అయితే ఎంత కాదన్నా ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు హాజరు కాకపోవడం పై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా.. ప్రజల్లో చర్చకు లేవనెత్తాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ పోషించలేని పాత్ర ఇప్పుడు విద్యార్థులు పోషించనుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.